భయం లేదంటూనే.. లెక్కబెట్టుకుంటున్న తమ్ముళ్ళు

మాకు భయమా.. దేనికి అంటున్నారు తమ్ముళ్ళు. నిజమే నిండా మునిగిన వారికి చలి భయం లేదు అని సామెత. వైసీపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రుల మీద కేసులు పెట్టడం ద్వారా…

మాకు భయమా.. దేనికి అంటున్నారు తమ్ముళ్ళు. నిజమే నిండా మునిగిన వారికి చలి భయం లేదు అని సామెత. వైసీపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రుల మీద కేసులు పెట్టడం ద్వారా వారికి జైలు భయం అరెస్ట్ భయం లేకుండా చేసింది అనే అంటున్నారు. అందుకే లోకేష్, బాలకృష్ణ నుంచి జిల్లా నేతల వరకూ కేసులు పెట్టుకోండి అరెస్ట్ చేసుకోండి అంటున్నారు.

అయితే ఇవన్నీ స్టేట్మెంట్స్ వరకే అని కూడా అంటున్నారు. తీరా అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ తెచ్చుకునే బాపతే ఎక్కువ. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు దీని మీద చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారు. కేసులు పెట్టుకోండి భయమా అంటూనే తన మీద పదిహేను కేసులు పెట్టారని లెక్క చూసుకుంటున్నారు.

అయ్యన్న పాత్రుడు మీద కేసులు పెట్టారు కానీ అరెస్ట్ అయితే అలా బెయిల్ తెచ్చుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. భయం లేకపోతే బెయిల్ ఎందుకు కేసుని ఎదుర్కోవచ్చు కదా అని సెటైర్లు వేస్తున్నారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన మీద ఎన్ని అయినా కేసులు పెట్టుకోవచ్చు అని అంటున్నారు.

తెలుగు తమ్ముళ్ళు ఇలా కేసులు పెట్టుకోండి అని చెప్పడం పెట్టిన కేసులు లెక్కపెట్టుకోవడం వెనక చాలానే ఉంది అంటున్నారు. కేసులు ఎవరికి ఎక్కువ ఉంటే వారే పోరాటయోధులు అని టీడీపీ యువ అధినాయకత్వం ఎక్కడికక్కడ చెబుతోంది. దాంతో అధికార పార్టీని ముఖ్యమంత్రిని దారుణంగా దూషిస్తూ కేసులు పడగానే బెయిల్ తెచ్చుకుంటూ మాకేమి భయమా అంటూ అదే తాము చేస్తున్న పోరాటంగా తమ్ముళ్లు భావిస్తున్నారని అంటున్నారు. 

ప్రజా పోరాటాల కంటే ఇలా కేసులు పెట్టించుకోవడంలోనే పొలిటికల్ క్రెడిట్ ఉందని భావిస్తే కేసులు పెరుగుతూనే ఉంటాయి. మైలేజ్ జనంలో ఎంత ఉంటుందో ఎన్నికల ఫలితాలే చెబుతాయని అంటున్నారు.