కూట‌మిని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్ ధీమా

ధీమాకు వైఎస్ జ‌గ‌న్ మారుపేరు. 2014లో ప్ర‌తిప‌క్షంలో కూచోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఏ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు. అలాగే త‌న ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను చంద్ర‌బాబునాయుడు అడ్డంగా కొనుగోలు చేస్తూ, టీడీపీలో చేర్చుకుంటున్నా… జ‌గ‌న్ బెద‌ర‌లేదు. ఏకంగా 23…

ధీమాకు వైఎస్ జ‌గ‌న్ మారుపేరు. 2014లో ప్ర‌తిప‌క్షంలో కూచోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఏ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు. అలాగే త‌న ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను చంద్ర‌బాబునాయుడు అడ్డంగా కొనుగోలు చేస్తూ, టీడీపీలో చేర్చుకుంటున్నా… జ‌గ‌న్ బెద‌ర‌లేదు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్ల‌మెంట్ స‌భ్యుల్ని టీడీపీలో చంద్ర‌బాబు చేర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ వైఎస్ జ‌గ‌న్‌లో మ‌రింత ప‌ట్టుద‌ల పెంచాయి.

అప్ప‌టికి రాజ‌కీయ అనుభ‌వం త‌క్కువైన‌ప్ప‌టికీ, న‌మ్మ‌కోవాల్సింది ప్ర‌జ‌ల్నే త‌ప్ప‌, నాయ‌కుల్ని కాద‌నే గ‌ట్టి నిర్ణ‌యం ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ తీసుకున్నారు. మ‌రోవైపు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న అసెంబ్లీని బ‌హిష్క‌రించి, జ‌నం బాట ప‌ట్టారు. సుదీర్ఘ పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు.

2019 ఎన్నిక‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 151 అసెంబ్లీ, 22 పార్ల‌మెంట్ స్థానాల‌ను గెలుచుకుని …ఔరా అనిపించుకున్నారు. ఐదేళ్ల పాల‌నకు ప్ర‌జాతీర్పు కోసం 2024లో మ‌ళ్లీ జ‌నంలోకి వెళ్లారు. త‌న పాల‌న‌లో మంచి జ‌రిగింద‌ని న‌మ్మితేనే ఓట్లు వేయాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మరోవైపు చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి న‌య‌వంచ‌న‌కు మారుపేర‌ని, 2014లో ఇదే జ‌ట్టు ఎలా మోస‌గించిందో, నాటి మ్యానిఫెస్టో చూపుతూ, ఏకిపారేశారు. 

ప్ర‌జాతీర్పును ఈవీఎంల‌లో రిజ‌ర్వ్ చేశారు. మ‌రోసారి అధికారంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టి ధీమాతో ఉన్నారు. ఈ ధీమానే కూట‌మిని భ‌య‌పెడుతోంది. ఈ ద‌ఫా ఓటింగ్ శాతం పెరిగింద‌ని, ఇది మార్పున‌కు సంకేతం అంటూ ఒక‌వైపు ప్ర‌చారం చేస్తూ, మ‌రోవైపు జ‌గ‌న్ విశ్వాసాన్ని చూసి జంకుతున్న ప‌రిస్థితి. జ‌గ‌న్ అంచ‌నా త‌ప్పు కాద‌నే న‌మ్మ‌కం ప్ర‌తిప‌క్ష కూట‌మిలో సైతం వుంది. 

జ‌గ‌న్ వ్య‌తిరేక ఓటు బ్యాంక్ సౌండ్ చేస్తోంది. అయితే జ‌గ‌న్ అనుకూల ఓటు బ్యాంక్ గుంభ‌నంగా వుంది. ఈ మౌన‌మే కూట‌మిని ఎక్కువ‌గా ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. మౌనం కూడా ఒక భాషే అంటారు. జ‌గ‌న్‌కు త‌న పాల‌న‌పై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ప్ర‌తి కుటుంబానికి మంచి చేసిన త‌న‌ను, ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌ర‌నే విశ్వాసంతో ఉన్నారు. జ‌గ‌న్ మేనిఫెస్టోపై విమ‌ర్శ‌లు చేసే సాహ‌సం కూట‌మి నేత‌ల్లో కొర‌వ‌డ‌డాన్ని చూశాం. ఒక‌ట్రెండు హామీలు మిన‌హాయిస్తే , అత్య‌ధికం జ‌గ‌న్ చెప్పిందే చేశారు. మ‌ళ్లీ ఆద‌రిస్తార‌ని జ‌గ‌న్‌కు అదే ధీమా.

కానీ జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త త‌మ‌కు అధికారం తెచ్చి పెడుతుంద‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌కం. అంతే త‌ప్ప‌, సుదీర్ఘ కాలం పాల‌నానుభ‌వం ఉన్న త‌న‌పై ప్ర‌జ‌లు ప్రేమ చూపుతార‌ని చంద్ర‌బాబుకు న‌మ్మ‌కం లేదు. తాను దేనికి బ్రాండో చంద్ర‌బాబుకు బాగా తెలుసు. ఆ బ్రాండ్ అధికారం తెచ్చేది కాద‌ని కూడా ఆయ‌న‌కు తెలుసు. జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌ను మాత్ర‌మే న‌మ్ముకున్న చంద్ర‌బాబు అంచ‌నా ఏ మేర‌కు నిజ‌మ‌వుతుందో త్వ‌ర‌లో తేల‌నుంది.