విశాఖ ఉక్కు భూముల అమ్మకానికి రంగం సిద్ధం అయింది. దానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది. నాన్-కోర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఓ త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇటీవల కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పోరేషన్, నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లు ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా కుదిరిన ఒప్పందంలో భాగం గానే విశాఖ ఉక్కు భూములను తొలి దశలో ల్యాండ్ మోనటైజేషన్ కార్పోరేషన్ ద్వారా 1400 ఎకరాలను విక్రయిస్తారని అంటున్నారు.
ఇక ఈ భూముల విక్రయం ప్రక్రియ సాఫీగా జరగడానికి నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ సలహాదారుగా వ్యవహరించనుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరో వైపు చూసుకుంటే ఇప్పటికి అయిదు దశాబ్దాల క్రితం విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం స్థానిక ప్రజలు వేలాది భూములను ఇచ్చారు. అలా ప్లాంట్ నిర్మాణం జరగగా ఈ రోజుకు 19వేల 700కు పైగా ఎకరాల భూమి రిజర్వ్ లో ఉంది.
ఇందులో నుంచి 1400 ఎకరాల భూముల విక్రయానికి పూనుకున్నారు. స్టీల్ ప్లాంట్ మొత్తం భూములకు సంబంధించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఉక్కు మంత్రిత్వ శాఖ పవర్ ఆఫ్ అటార్నీ కలిగి ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అందువల్ల విక్రయానికి అడ్డు ఏదీ లేదని చెబుతోంది. అయితే విశాఖ ఉక్కు భూములని విక్రయించే హక్కు ఎవరికీ లేదని అవి ప్రజల సొత్తు అని కార్మిక సంఘాలు అంటున్నాయి. వీటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాయి.