Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఏపీ సీఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు?

ఏపీ సీఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు?

ప్రభుత్వ తప్పిదాలకు సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షలకు గురి కావడం ఏపీలో సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన దాదాపు పది మంది సివిల్ సర్వీస్ అధికారులు శిక్షకు గురైన సంగతి తెలిసిందే. మొదట  జైలు శిక్ష విధించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తరువాత అధికారుల విజ్ణప్తిపై ఆ శిక్షను సామాజిక సేవా శిక్షగా మార్చింది. 

ఇప్పుడు సుప్రీం ఆదేశాల ఉల్లంఘన పై సీఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుందోనన్న చర్చ అధికారులలో జరుగుతోంది. ఇంతకూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టు ఉత్తర్వులను కాదు సుప్రీం కోర్టు ఉత్తర్వులనే ఉల్లంఘించారు. పొలిటికల్ బాసులకు జీ హుజూర్ అనే సివిల్ సర్వీస్ అధికారులున్న (అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారనుకోండి ) ఏపీలో మార్పు రావడంలేదు.

కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరంలేదని పొలిటికల్ బాసులు చెబుతుంటే అధికారులు చిత్తం మహారాజా అంటున్నారు. కథ అడ్డం తిరిగితే కోర్టుకు వెళ్లి లెంపలు వేసుకుంటున్నారు. క్షమాపణలు చెబుతున్నారు. అవసరమైతే శిక్షలూ అనుభవిస్తున్నారు. కానీ వారి తీరు మాత్రం మార్చుకోవడంలేదు. అసలు విషయానికొస్తే ... ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం జగన్ సర్కార్ కు లేదని తెలుస్తోంది. 

ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసం జగన్ సర్కార్ ఏకంగా సుప్రీం కోర్టు  తీర్పును కూడా ఉల్లంఘించి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది. న్యాయస్థానాలు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా జగన్ సర్కార్ తీరు మారడం లేదు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఏపీ సర్కార్ నేరుగా సుప్రీం కోర్టు ఆదేశాలనే బేఖాతరు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. 

సీనియర్ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ముగిసిందని ఆయనకు తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు  విస్పష్ట ఆదేశాలిచ్చి రెండు వారాలు గడిచినా, ఇంత వరకూ ప్రభుత్వం ఆ ఆదేశాల అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పైపెచ్చు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సీఎస్ ను కలిసిన వెంకటేశ్వరరావుకు అవమానమే ఎదురైంది. 

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీని కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరిన ఏబీవీకి సానుకూల సమాధానం వచ్చింది. అయితే ఆ తరువాత తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగినప్పుడు కనీసం సర్వీసులోకి తీసుకున్నట్లుగా ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే తనకు పోస్టింగ్ ఇవ్వాలని అడిగేందుకు మరోసారి ఆయన సచివాలయానికి వెళ్లారు.

సీఎస్ అందుబాటులో లేకపోవడంతో మరోసారి వెళ్లారు. అయితే ఈసారి ఆయనను వెయిటింగ్ రూములో ఉంచి సీఎస్ బయటకు వెళ్లిపోయారు. వైసీపీ అధికారం చేపట్టగానే ఏబీ వెంకటేశ్వరరావుపై కేసులు పెట్టి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సుప్రీంకోర్టు ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ సర్కార్ ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. సర్కార్ తీరు సివిల్ సర్వీస్ అధికారులలో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?