Advertisement

Advertisement


Home > Politics - Andhra

గోరంట్ల మాధవ్.. మరో పృధ్వీ అవుతారా?

గోరంట్ల మాధవ్.. మరో పృధ్వీ అవుతారా?

రాజకీయ నాయకుల మీద అసహ్యకరమైన ఆరోపణలు వచ్చినప్పుడు.. ఆధారాలతో సహా వారు జూగుప్సాకరమైన పనులతో బజార్లో పడ్డప్పుడు.. ఆయా పార్టీల అధిష్టాన వర్గాలు చాలా చిత్రంగా స్పందిస్తుంటాయి! తమ పార్టీకి చెందిన సదరు నాయకుల మీద చర్య తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తాయి! 

ఆరోపణలు నిరాధారాలు కావచ్చునని.. అవి నిరూపణ అయ్యేవరకు తమ నాయకుడు పరిశుద్ధుడేనని.. బుకాయించే ప్రయత్నం చేస్తాయి! చాలా సందర్భాలలో నాయకుల మీద వచ్చే ఆరోపణలు, నిందలు నిజంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడతాయి! కానీ కాస్త ఆలస్యంగా అయినా సరే.. కొన్ని సందర్భాల్లో చర్య తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కారణంగా.. గతంలో నటుడు పృథ్వీని తిరుమల దేవస్థానం వారి పదవినుంచి తొలగించింది. ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ అదే తరహా చిక్కుల్లో ఉన్నారు!

తాజాగా తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలో కూడా సంచలనంగా మారిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నగ్న సంభాషణ! ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ దొరికిపోయారు! మామూలు వివాదం కాదు ఇది. వైయస్ జగన్మోహన్ రెడ్డి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణకు భద్రతకు తాను భరోసాగా నిలుస్తానని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు! 

దిశ వంటి చట్టానికి రూపకల్పన చేయడమే చాలా గొప్ప సంగతి. మహిళల రక్షణ కు సంబంధించి రాష్ట్రంలో అనేక రకాల నిర్ణయాలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా ఉండే వాతావరణం కూడా ఏర్పడుతోంది! మహిళల భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని శంకించడానికి ఏమాత్రం వీల్లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలుగా కాకుండా నిజాయితీతో తీసుకుంటున్న నిర్ణయాలుగా మనకు కనిపిస్తాయి!

అయితే అధినేత ఈ రకంగా వ్యవహరిస్తుంటే.. పార్టీలోని కిందిస్థాయి నాయకులు కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం పార్టీ పరువును బజారులో పెట్టేస్తున్నారు. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనతో వార్తల్లోకెక్కుతున్నారు. గోరంట్ల మాధవ్ సంఘటన మొదటిది కాదు, ఇదివరకు కూడా ఇలాంటివి జరిగాయి. అయితే పార్టీ వాటి పట్ల కఠినంగానే వ్యవహరించింది. 

వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమారంగం నుంచి కమెడియన్ పృథ్వి కి తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహణలోని ఎస్వీబీసీ ఛానల్ సారధ్యం వహించే సువర్ణ అవకాశం కల్పించింది! పృథ్వి దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 

ఒక మహిళతో అసభ్యంగా ఫోన్ కాల్ లో మాట్లాడుతూ దొరికిపోయారు. ఆయన అది మార్ఫింగ్ కాల్ గా బుకాయించడానికి ప్రయత్నించారు గాని, తప్పించుకోలేకపోయారు. పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద నిందలు వేస్తూ పవన్ కళ్యాణ్ పంచన చేరడానికి ఉత్సాహపడుతున్నారు! జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గుర్తింపును తన అనుచిత ప్రవర్తనతో నాశనం చేసుకున్న వ్యక్తిగా పృథ్వి నిలిచిపోయారు!

ఇప్పుడు గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది. పృథ్వి ఆడియో కాల్ లో దొరికితే, గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లోనే దొరికారు. ఆయన ఆడియో మార్ఫింగ్ జరిగిందని అన్నట్లుగానే.. ఈయన వీడియో మార్ఫింగ్ జరిగిందని కూడా అంటున్నారు. మామూలుగా కాదు చాలా గట్టిగా అంటున్నారు. దబాయిస్తున్నారు. వాడే భాషలో తాను గతంలో పోలీసును అనే సంగతి గుర్తు తెచ్చుకుంటున్నారు. ‘పోలీసు భాష’ అనే నిర్వచనాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఆయన ఎంత దబాయించినా నిజం దాగదు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నది. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా దీనిని పరిగణిస్తున్నది. మహిళా లోకానికి తాను అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా, మనవడిగా ఉంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ ఉంటారు. అలాంటిది మహిళా ప్రపంచంలో పార్టీ చులకన కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. 

గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఫోరెన్సిక్ ఏం చెప్పినా సరే ప్రజలందరూ ఏం నమ్ముతున్నారనేదే ముఖ్యం. ఆ సంగతి పార్టీ అధిష్టానం గుర్తుంచుకోవాలి. పృథ్వి మీద చర్యలు తీసుకున్నట్లే గోరంట్ల మాధవి మీద కూడా చర్యలు తీసుకోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. 

మాధవ్ కోసం పార్టీ పరువు పోయేలాగా ఫోరెన్సిక్ నివేదికల్లో మతలబుల కోసం ప్రభుత్వం ప్రయత్నించకపోవచ్చునని అనుకుంటున్నారు. అదే జరిగితే.. మాధవ్ మీద కూడా వేటు పడుతుంది. పృథ్వీ లాగానే మాధవ్ రాజకీయ ఎపిసోడ్ కు తెరపడుతుంది!

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా