‘మాట తప్పను మడమ తిప్పను’ అనేది జగన్మోహన్ రెడ్డి తాను ఆచరించే సిద్ధాంతంగా చెప్పుకుంటారు! పార్టీ మనుగడ మొత్తం ఆ సిద్ధాంతం మీదనే ఆధారపడి నడుస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని వారు బహుధా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులు ఉన్నట్లే.. జగన్మోహన్ రెడ్డి మాటలకు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి.
‘మాట తప్పను’ అనేది చాలా సందర్భాల్లో ఆయన పాటిస్తారేమోగానీ కొన్నిసార్లు మిస్ అవుతుంటారు. సమూహంగా ప్రజలకు ఇచ్చే మాటలు నిలబెట్టుకోవడానికి జగన్ ఎంత శ్రద్ధగా ఉంటారో.. తన నుంచి ప్రయోజనం ఆశించి వచ్చే వ్యక్తులకు ఇచ్చే మాటలు నిలబెట్టుకోవడానికి అంతే శ్రద్ధగా ఉంటారా లేదా అనేది ప్రశ్నార్థకం! అందుకే ఇవాళ కుప్పంలో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో భాగంగా ‘వచ్చే ఎన్నికలలో అక్కడ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని’ జగన్ మోహన్ రెడ్డి చెబితే నమ్మాలా వద్దా అనే సంశయం కలుగుతోంది!
కుప్పంలో నారా చంద్రబాబు నాయుడును ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే కనుక అది చాలా గొప్ప సంగతి! ఏడు పర్యాయాలుగా అప్రతిహత విజయాలను నమోదు చేస్తున్న చంద్రబాబును మట్టికరిపించిన వాడు- ఎవరైనా సరే జెయింట్ కిల్లర్ అనే గుర్తింపు తెచ్చుకుంటాడు! అలాంటి వ్యక్తిని ఏ పార్టీ అయినా నెత్తిన పెట్టుకోవడం ఖాయం! పదవులు ఇవ్వడమూ సహజం!! కానీ, జగన్మోహన్ రెడ్డి అలా చేస్తారా? మాట నిలబెట్టుకుంటారా? అనేది మాత్రం కొంచెం సందేహం!!
2019 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 151 యొక్క సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెయింట్ కిల్లర్లు లేకుండా పోలేదు! వారికి సంబంధించి కూడా జగన్ ఇలాంటి హామీలే అప్పట్లో ఇచ్చారు. మంగళగిరిలో నారా లోకేష్ బరిలోకి దిగితే ‘అతనిని ఓడించడం అసాధ్యం’ అని సాధారణంగా అందరూ అంచనా వేశారు.
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఆదరణ కూడగట్టుకోవడం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు కొడుకుగా. కాలం కలిసి వస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అభిమానుల ఊహల్లో ఉండే నారా లోకేష్… తొలిసారిగా ఎమ్మెల్యే బరిలోకి దిగినప్పుడు ఆయనను గెలిపించుకోవడానికి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది కనుక ఆయనపై విజయం కష్టం అని విశ్లేషకులు అంచనా వేశారు. వారి ఊహలన్నీ తలకిందులయ్యాయి!
ఆళ్ళ రామకృష్ణారెడ్డి- నారా లోకేష్ ను ఘోర పరాభవానికి గురి చేశారు. తెలుగుదేశం దళాలు మంగళగిరి ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు! తెలుగుదేశం పార్టీ పతనానికి నారా లోకేష్ ను ఓడించడం ద్వారా తాను శ్రీకారం చుట్టపోతున్నానని ఎన్నికలకు ముందే సన్నిహితులతో ప్రకటించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ మాట నిలబెట్టుకున్నారు. అయితే ఆర్కే విషయంలో జగన్ మాట మాత్రం నిలబెట్టుకోలేదు!
మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆర్కే అన్నని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ఆనాడు జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలుగా మంత్రి పదవుల పంపిణీ జరిగింది గాని, ఆర్కే కు అవకాశం దక్కలేదు! వ్యక్తిగతంగా నాయకులకు నాలుగ్గోడల మధ్య ఇచ్చే పదవుల హామీలు మనకు అనవసరం.. కానీ ప్రజల ఎదుట బహిరంగ వేదికల మీద ఇచ్చిన హామీలను జగన్ గుర్తుంచుకోవాలి కదా!! ఆర్కే లాగానే మర్రి రాజశేఖర్ విషయంలో కూడా మంత్రిని చేస్తానంటూ జగన్ బహిరంగంగానే ప్రకటించారు! అది కూడా జరగలేదు. ఇప్పుడు కుప్పంలో భరత్ విషయంలో మాత్రం జరుగుతుందా? అక్కడి ప్రజలు జగన్ మాటలు ఎందుకు నమ్మాలి??
కేవలం జెయింట్ కిల్లర్ కావడం ఒక్కటే మంత్రి పదవికి అర్హతను ఇచ్చేస్తుందా!? చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఘనాపాటీలు మంత్రి పదవుల కోసం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా.. పెద్దిరెడ్డి మంత్రి అవుతూ ఉండాల్సిందే! అలాంటి నేపథ్యంలో ఇరుగుపొరుగు నియోజకవర్గాలకు మంత్రి పదవులు దక్కడం ప్రాక్టికల్ గా సాధ్యమేనా? కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారా? అనేది సందేహమే!!
ఇదంతా నారా చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పటి సంగతి కదా అప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుంటే కుదర్దు! ఎందుకంటే, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కుప్పంలో బాబు ఓడిపోవడం కూడా నమ్మలేని విషయం, అతిశయం ఏమాత్రం కాదు!!