దేశవ్యాప్తంగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు కొదవలేదు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తున్న ఘటనలు కూడా కోకొల్లలు. గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. కాకపోతే మీరు ఊహించిన దానికి రివర్స్ లో జరిగింది.
ఓ యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది ఓ అమ్మాయి. గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగింది ఈ ఘటన. దీంతో తీవ్ర గాయాలతో ఆ యువకుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
నల్లపాడుకు చెందిన వెంకటేష్ అనే యువకుడు, తెలంగాణలోని ఖమ్మంకు చెందిన రాధ స్నేహితులు. కొన్నాళ్లకు వీళ్లిద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా ఉందంటున్నారు తెలిసిన వాళ్లు.
ఈ క్రమంలో ఉన్నట్టుండి హఠాత్తుగా ఈరోజు వెంకటేష్ పై యాసిడ్ పోసింది రాధ. దీంతో వెంకటేష్ కేకలు వేశాడు. కాలిన గాయాలతో హాహాకారాలు చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వెంకటేష్ ను గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వెంకటేష్ కు ప్రాణాపాయం తప్పిందని ప్రకటించిన వైద్యులు, అతడికి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ యాసిడ్ దాడికి కారణమని ప్రాధమికంగా భావిస్తున్నారు. అటు యువతి సంబంధీకులు, బాధితుడితో సంప్రదింపులు జరుపుతున్నారు.