పేదలకు డీబీటీ ద్వారా చెల్లించాల్సిన నిధులపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారు. ఎన్నికలు ముగిసినా, వైసీపీపై ప్రజా వ్యతిరేకత సృష్టించే రాతలు మాత్రం ఎల్లో మీడియా ఇంకా మానకపోవడం గమనార్హం. ఇంకా ఏం కోరుకుని పేదల నిధులపై అబద్ధాల రాతలు రాస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
వివిధ పథకాల కింద జగన్ ప్రభుత్వం పేదలకు రూ.14,165 కోట్ల నిధుల్ని డీబీటీ ద్వారా చెల్లించాల్సి వుంది. ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ సందర్భాల్లో బటన్ కూడా నొక్కారు. ఆసరా, కల్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాల్సి వుంది.
ఎన్నికలకు ముందు నిధులు జమ చేయడానికి ఈసీ అడ్డుపడింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఈసీ ఉద్దేశపూర్వకంగానే మెలిక పెట్టింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈసీపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. హైకోర్టు కంటే గొప్ప వాళ్లని అనుకుంటున్నారా? అంటూ ఈసీని నిలదీయడం చర్చనీయాంశమైంది.
ఎన్నికల తర్వాత నిధులు జమ చేయడానికి ఈసీ అనుమతించింది. అయితే ఈ నిధులన్నీ తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు చెల్లించడానికి పక్కదారి పట్టిస్తున్నారంటూ పేదలపై ఎల్లో బ్యాచ్ లేని ప్రేమాభిమానాలను కురిపిస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు… ముందు అనుకున్నట్టుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధుల్ని జమ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు.
ఒకట్రెండు రోజుల్లో రూ.14,165 కోట్ల పేదల సొమ్ము వారి ఖాతాల్లోనే జమ కానుంది. ఎల్లో మీడియా, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు.. ఆ నిధుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చే ఉద్దేశం జగన్ సర్కార్కు లేదు. ఎందుకంటే మరోసారి తామే అధికారంలోకి రాబోతున్నామనే ధీమా వారిలో ఉంది. అలాంటప్పుడు వేరే రకంగా ఆలోచించే దుస్థితి తమకు లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.