Advertisement

Advertisement


Home > Politics - Andhra

‘ముసలాయన’ మాయం: మారిన జగన్ ప్రసంగం!

‘ముసలాయన’ మాయం: మారిన జగన్ ప్రసంగం!

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడునెలల విద్యాదీవెన మొత్తం సుమారు 703 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.

రాష్ట్రప్రజలందరూ కూడా తన ప్రభుత్వానికి అండగా ఉండి జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మళ్లీ గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా జగన్ సుదీర్ఘంగానే ప్రసంగించారు. ఆయన మాటల్లో ఒక ప్రధానమైన తేడా కనిపించింది. 

చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చినప్పుడు- ‘ముసలాయన’ అంటూ వయసును ఎద్దేవాచేసే మాటలు జగన్ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి వైఖరిలో ఈ మార్పు ‘గ్రేట్ ఆంధ్ర’ తీసుకువచ్చినట్టుగా అనిపిస్తోంది.

గ్రేట్ ఆంధ్ర మేగజైన్ లో ఇటీవల ‘మీరు మారరా?’ శీర్షికతో మోడీ సరహా నాయకులు తమ తమ ప్రసంగాల్లో వాడుతున్న అనుచితమైన మాటలను ప్రస్తావిస్తూ కవర్ స్టోరీ ప్రచురించడం జరిగింది. నాయకులు ఎప్పుడూ కూడా ప్రజలకు సమాజానికి అవసరమైన అంశాల గురించి ప్రస్తావించాలి, ఆ దిశగా తమ ప్రత్యర్థుల లోపాలను, వైఫల్యాలను, చేతగానితనాన్ని విమర్శించాలే తప్ప.. దారితప్పిన ప్రసంగాల్లో అనుచితమైన విషయాలను ప్రస్తావించడం మంచిది కాదు.. అనే అంశాన్ని ఆ కథనంలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది.

రాముడు, హనుమంతుడు, హిందూత్వను వాడుకోకుండా మోడీ మాట్లాడలేరని, చంద్రబాబు- జగన్ ను సైకో అంటూ చెత్త కబుర్లు చెప్తుంటారని, జగన్- చంద్రబాబును ముసలాయన అంటూ ఆయన వయసును ఎద్దేవా చేసే మాటలు అనుచితమని కథనం వివరించింది.

ప్రజల కోసం పనిచేసే, ప్రజల ఆదరణ ఉన్న నాయకులు.. ప్రజలకు సంబంధించిన అంశాలనే తమ ప్రసంగాల్లో వాడితే బాగుంటుంది గానీ.. ఎదుటి వారిని ఎద్దేవా చేయడానికి హేళన చేయడానికి అనుచితమైన దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కథనం తీసుకొచ్చిన మార్పు ఇది అని అనిపించే విధంగా జగన్ తన ప్రసంగంలో ‘ముసలాయన’ అనే ప్రస్తావన మానేశారు. 

చంద్రబాబు వైఫల్యాలను, చేతగానితనాన్ని, నిష్క్రియాపరత్వాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారు. నిజానికి ఇది శుభపరిణామం. ఇదే తరహాలో.. చంద్రబాబు కూడా జగన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘సైకో’ అనే పదం వాడుతూ దిగజారుడు మాటలు మాట్లాడకుండా మారితే బాగుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?