Advertisement

Advertisement


Home > Politics - Opinion

మీరు మారరా?

మీరు మారరా?

మతాన్ని అడ్డు పెట్టుకోకుండా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టకుండా, దేవుడిని బలవంతంగా ఈడ్చుకొచ్చి తమ ఎన్నికల ప్రచారానికి ట్రంపుకార్డులాగా వాడుకోకుండా ఒకరు మనుగడ సాగించలేరు.. ఒకరిని మతపరమైన బూచిగా చూపించి తమ మతంలో భయాన్ని రేకెత్తించకుండా మరొకరు బతకలేరు..

తాము ప్రజలకోసం ఏం చేస్తామో చెప్పుకుని నెగ్గడం గొప్ప రాజకీయం! కానీ.. తమ ప్రత్యర్థులను తిట్టడం ద్వారా మనుగడ సాగించడం వర్తమాన నీచవ్యవహారం!! ఒకరు వార్ధక్యాన్ని ప్రస్తావిస్తారు, ఒకరు శారీరక దౌర్బల్యాల్ని దెప్పిపొడుస్తారు, ఒకరు రెండు తిట్లు తయారుచేసుకుని వాటిని ప్రచారంలో పెడుతుంటారు, ఒకరు వ్యక్తిగత జీవితంలో బెడ్రూం విషయాలను రాజకీయ నిందలుగా మారుస్తుంటారు! ఏమిటీ పోకడ? ఎందుకింత నీచసంస్కృతి తయారవుతోంది??

తమ తమ పార్టీల విధానాలను వివరించుకోలేరా? ప్రత్యర్థుల్లో, ప్రభుత్వాల్లో పాలనలోపాలను ఎత్తిచూపలేరా? ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన వాగ్దానాలతో ముందుకు వెళ్లలేరా?

ప్రజల ఆలోచనలను దారి మళ్లించి, వారిలో ఆవేశకావేషాలను రెచ్చగొట్టి, వారి ఉద్రేకాలను రెచ్చగొట్టి తమ మాటలతో పబ్బం గడుపుకోవడం తప్ప.. వారి ఆలోచనను పదునుపెట్టే, వారి బతుకుల్లో వెలుగులు నింపే మార్గంలో వీళ్లు ఎప్పటికీ మాట్లాడరా? అనే కోణంలో ఒక సామాన్యుడి అంతరంగంలో రగిలే ఆవేదనకు అక్షర రూపమే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘మీరు మారరా?’

రాజకీయ పార్టీలనుంచి ప్రజలు ఏం ఆశిస్తారు? ప్రజలు వారినుంచి ఏం కోరుకుంటారు? ప్రజాస్వామ్యంలో పార్టీలే ప్రభుత్వాలుగా మారుతున్నప్పుడు తమ జీవితాలు ఇప్పుడు ఉన్న దశనుంచి మరికాస్త బాగుపడాలని ప్రజలు కోరుకుంటారు. తమ ఊర్లు, తమ జీవితాలు అంతిమంగా ఈ దేశం మరింత గొప్పగా ఆవిష్కృతంగా కావాలని ప్రజలు కోరుకుంటారు. నాయకులనుంచి వారు ఆశించేది అంతే ఉంటుంది. బిస్కట్ పథకాలు కావొచ్చు.. నిర్మాణాత్మక అభివృద్ధి కావొచ్చు.. ఏ రూపంలో అయినా అంతిమంగా సమాజ వికాసమే నాయకుల మాటల్లో ప్రజలు ఆశించే అజెండా అయిఉంటుంది.

ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రతి నాయకుడూ– ప్రతి సందర్భంలోనూ అదే తరహాలో మాట్లాడుతున్నారా? తాము చేయగల అభివృద్ధి, స్వప్నిస్తున్న సంక్షేమం గురించి మాత్రమే చెప్పి.. ప్రజలను నమ్మించాలని అనుకుంటున్నారా? ఆ అంశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారా? తమ పార్టీ గెలిస్తే ప్రజలకోసం, సమాజంకోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నామో.. ముందుకు తీసుకువెళ్లడానికి ఎలాంటి నిర్మాణాత్మక అడుగులు వేయాలనుకుంటున్నామో చెప్పడానికే శ్రద్ధ చూపుతున్నారా? అంటే వెంటనే జవాబు చెప్పలేని పరిస్థితి. 

రాజకీయం అన్న తర్వాత కేవలం పాజిటివ్ మాటలతో పని జరగదు. దీన్ని మనం అందరం కూడా ఒప్పుకుంటాం. తాము చేసే మంచిని చెప్పుకోవడంతో నడవదు.. తమ ప్రత్యర్థులు చేతకానివాళ్లని, ద్రోహులని ప్రచారం చేయడం కూడా ప్రతి పార్టీకి ఒక అవసరంగా మారిపోయిన వాతావరణం ఇవాళ్టి సమాజంలో ఉంది. ప్రజలకు ఏమాత్రం అవసరంలేని విషయాలను మాట్లాడడం, స్పైసీగా ఉండే విషయాలే ప్రధానంగా మాట్లాడుతూ ప్రజల ఆలోచనల్ని దారి మళ్లించడం. 

ప్రజలు సాధారణంగా పార్టీలనుంచి ఏం ఆశిస్తారో, అలాంటి ఆశల మీద వారి దృష్టి నిలవకుండా స్పైసీ విమర్శలతో ఆకట్టుకోవడం.. ఇదంతా ఒక కుటిలరాజనీతి శాస్త్రం నవతరం అధ్యాయంగా మారిపోయింది. ఈ విషయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఒక తాను ముక్కలే! అందరు నాయకులదీ అదే ధోరణి. వీరు ఎప్పటికీ మారరా? అనేది మన సందేహం. కీలక నాయకుల్లో ఒక్కొక్కరూ ఎలా వ్యవహరిస్తున్నారో, ఎలాంటి మాటలతో ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేస్తున్నారో గమనిద్దాం. 

జగన్ .. ‘ముసలాయన’.. ‘ముగ్గురు పెళ్లాలు’

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలోని పేదలు గతంలో ఎన్నడూ ఎరగని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. వాటిగురించి చెప్పుకోడానికే బోలెడంత సమయం కావాలి. కానీ.. ప్రత్యర్థులను తిట్టడం కూడా ఒక అవసరంగా మారిపోయింది గనుక.. ఆయన చంద్రబాబునాయుడును తిడుతుంటారు. అందుకోసం ఆయన ప్రధానంగా ఎంచుకునే పదం.. ‘ముసలాయన’ అనేది. ఓ ముసలాయన ఉన్నాడు.. ఆ ముసలాయన ఇలా అంటాడు.. అంటూ పదేపదే ముసలాయన అనే పదంతో చంద్రబాబు వయసును జగన్ ఎద్దేవా చేస్తుంటారు. ముసలితనం అనేది ఈ భూ ప్రపంచంలో చంద్రబాబునాయుడుకు మాత్రమే వచ్చినట్టుగా, రాజకీయాల్లో మరెవ్వరికీ అది రానేరాదన్నట్లుగా జగన్ ఎగతాళి మాటలు సాగుతుంటాయి.

వయసును, వైకల్యాన్ని ఎత్తిచూపుతూ చేసే విమర్శలు ఎప్పుడూ కూడా మంచివి కాదు. ఆ విషయాన్ని రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న పెద్దగా ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోవాలి. ప్రజలు ఆయనను విశ్వసిస్తే జగన్ మళ్లీ గెలుస్తారు. ఈసారి గెలిస్తే మరో ముప్ఫయ్యేళ్ల పాటు తమ ప్రభుత్వమే ఉండేలా పనిచేస్తానని ఆయన పదేపదే చెబుతుంటారు. ఇప్పుడే 50 ఏళ్లు దాటిన జగన్ కు మరో 30 ఏళ్లు పాలన అంటే.. అప్పటికి వయసు ఎంత? అప్పటికి 80 ఏళ్ల వయసుండే జగన్ ముసలాయన కాకుండా ఏం అవుతారు? ముసలితనం అనేది ఎవ్వరికైనా వచ్చే తీరుతుంది కదా? అలాంటి అంశాన్ని పట్టుకుని ఎద్దేవా చేయడం మంచి పద్ధతి కాదు. 

దీనివల్ల నష్టం కూడా ఉంది. ముసలాయన అంటూ అనడం వల్ల, చంద్రబాబును తిట్టడానికి జగన్ వద్ద మరో పాయింట్ లేదేమో అని కూడా ఎవరైనా అనుకునే ప్రమాదం ఉంటుంది. చంద్రబాబునాయుడు పరిపాలన ఎంత అవకతవకగా ఉంటుందో, ఆయన గ్రాఫిక్స్ చూపించి, అదే రాజధాని అని  ప్రజలను ఎలా మోసం చేయగలరో, జనం సంక్షేమం పట్టకుండా అయినవాళ్లకి దోచిపెట్టడమే ఎజెండాగా పాలన ఎలా సాగిస్తారో, రాజధాని అనే ముసుగులో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా పేద రైతులను వంచించి ఎలా కాజేస్తుంటారో.. ఇలా అనేక అంశాలు ప్రస్తావించవచ్చు. 

తన రాజకీయ ప్రత్యర్థి మంచివాడు కాదు, ప్రజల మేలుకోరేవాడు కాదు అని నిరూపించడానికి ఇదే విషయాలను మళ్లీ మళ్లీ వినిపించినా తప్పులేదు. కానీ.. ముసలాయన అంటూ వయసును ఎద్దేవా చేస్తూ మాట్లాడడం కరెక్టు కాదు. చంద్రబాబునాయుడు కంటె ముసలి వాళ్లు, చక్రాల కుర్చీలో కూర్చుని రాజకీయంలో చక్రం తిప్పుతున్న వారు మన దేశంలో అనేకులు ఉన్నారు. కానీ చంద్రబాబునాయుడు తీరే వేరు. ఆయనకు సంవత్సరాల పరంగా వార్ధక్యం వచ్చి ఉండొచ్చు గానీ, ఆయన ఫిట్ నెస్ అసామాన్యమైనది. 

తాజాగా ఆయన రైతులకోసం 17 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసి తన ఫిట్ నెస్ నిరూపించుకున్నారు. చాలా మంది యువ వైసీపీ నాయకులకు, నలభైలు దాటని ఎమ్మెల్యేలకు లేనంత గొప్ప ఫిట్ నెస్ చంద్రబాబునాయుడుకు ఉంటుంది. ఆహారవ్యవహారాల విషయంలో ఆయన డిసిప్లయిన్ ఈ ఫిట్ నెస్ కు కారణం. ఈ విషయం ప్రజల్లో ఆయనను ఇష్టపడని వారికి కూడా తెలుసు. అలాంటప్పుడు.. కేవలం ‘ముసలాయన’ అనేపదం ద్వారా ఆయన పట్ల ప్రజల్లో అసహ్యం ఏవగింపు పుట్టించవచ్చునని జగన్ ఎలా అనుకుంటారో తెలియదు!

జనసేన పవన్ కల్యాణ్ విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే తప్పు చేస్తుంటుంది. ఆయనను తిట్టదలచుకున్న ప్రతి సందర్భంలోనూ వారు మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తుంటారు. పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం సామాన్య ప్రజలకు ఎందుకు? కానీ, ఆ విషయం వైసీపీ నేతలు మాట్లాడుతోంటే.. చాలా స్పైసీగా వారి అభిమానులకు మజా ఇస్తుంటుంది. స్పైసీ మాటలతో ప్రజల ఆలోచనను దారి మళ్లించడానికి వైసీపీ వారు పదేపదే అదే పెళ్లిళ్ల మాటలు చెబుతుంటారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ కు పవన్ కల్యాణ్ ఇంకేం లోపాలు కనిపించవా? వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను మాట్లాడడం ఎలా సబబు అనిపించుకుంటుంది. రాజకీయ నాయకుడిగా నిలకడలేనితనం, అసమర్థత, రెండో శ్రేణి నాయకులకు గతిలేని జనసేన దుస్థితి, తలాతోకా లేకుండా అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా విమర్శనాంశాలే. అయితే వైసీపీ నాయకులు ముగ్గురు పెళ్లాల మీద పెట్టిన శ్రద్ధ.. ఇతర అంశాల మీద పెట్టకపోవడం విచారకరం.

చంద్రబాబునాయుడు.. ‘సైకో’

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభ్యంతర పెట్టడానికి పెద్దగా అంశాలు లేవు. తెలుగుదేశం వారి కళ్లకు కనిపించేదెల్లా.. ఆ పార్టీ నాయకులకు సంబంధించిన ఆస్తులపై ప్రభుత్వం దాడులు చేయించి.. వాటిని జేసీబీలతో కూలగొట్టించిన వ్యవహారాలు మాత్రమే. అందువల్ల.. అది విధ్వంసానికి పెద్దపీట వేసే ప్రభుత్వం అనేది తెలుగుదేశం ఆరోపణ. అలా, పరిపాలనను విధ్వంసంతో ముడిపెట్టేశారు గనుక.. ముఖ్యమంత్రిని ‘సైకో’ అంటూ తూలనాడడం చంద్రబాబునాయుడుకు అలవాటుగా మారిపోయింది. 

జగన్ పేరు తీయవలసిన ఏ సందర్భంలోనూ ‘సైకో’ అనే పదం వాడకుండా చంద్రబాబు మాట్లాడలేరు. అది ఆయన బలహీనతగా మారిపోయింది. తెలుగుదేశం నాయకుల మీద ప్రభుత్వం చేయించిన దాడులు కూల్చివేతలను చాటుతూ అది జగన్ దుర్మార్గం కింద టముకు వేస్తున్నారే.. మరి ఏ ఒక్క కూల్చివేతల విషయంలోనైనా సదరు ఆస్తుల యజమానులైన తెదేపా నేతలు కోర్టుకు వెళ్లి.. తమ నిర్మాణం సబబే అని తీర్పు తెచ్చుకోగలిగారా? ప్రభుత్వం కూల్చినది అక్రమం అని, తమవి చట్టబద్ధ నిర్మాణాలు అని చాటగలిగారా? అలాంటప్పుడు జగన్ ను సైకో అంటూ విమర్శించడం ఎంత అర్థం లేని పని!

ఈ విమర్శలను గమనిస్తే, జగన్మోహన్ పరిపాలనలో లోపాలు చెప్పడానికి చంద్రబాబు దగ్గర పెద్దగా కంటెంట్ లేదని అర్థమైపోతుంది. ఏ పథకాన్ని విమర్శించినా.. దాని ఫలితాలను రుచిచూస్తున్న ప్రజలు తననే అసహ్యించుకుంటారని ఆయనకు భయం. అందుకే చంద్రబాబు ప్రధానంగా ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనే నినాదాన్ని ప్రచారంలో పెడుతున్నారు. పదం అందంగా ఉన్నదని, కడుపుమంట చల్లారేలా జగన్ ను తిట్టవచ్చునని పదేపదే సైకో అంటూ ఉంటే.. ప్రజలు చంద్రబాబునాయుడు పెద్దరికాన్ని గుర్తించినా, కురచబుద్ధిని అసహ్యించుకుంటారని ఆయన తెలుసుకోవాలి. 

పవన్ కల్యాణ్.. ‘కులమూ’, ‘సంపాదనా’

పవన్ కల్యాణ్ ప్రతిమాట అర్థం పర్థం లేకుండా ఉంటుంది. ఆయనకు విషయ జ్ఞానమూ అవగాహనా ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి. స్క్రిప్టులను ప్రిపేర్ అయి ప్రజలముందుకు వస్తారు. ఆ స్క్రిప్టులకు ఎలాబోరేటెడ్ మాటలు హావభావ విన్యాసాలతో జనరంజకంగా మాట్లాడతారు. ఆయన వరుసగా నాలుగు వాక్యాలు మాట్లాడితే మొదటి దానికి చివరిదానికి కాంట్రడిక్షన్ ఉంటుంది. ఒక్కో సినిమాకు మధ్య పాత్ర స్వరూప స్వభావాలు మారిపోయినట్టు.. ఆయన విమర్శలు కూడా డైరక్షన్ మారిపోతుంటాయి. అనేక సందర్భాల్లో డైరక్షన్ లెస్ గా కూడా ఉంటాయి. ‘కులమూ సంపాదన’  అనే రెండు పదాలు లేకుండా పవన్ కల్యాణ్ ఏ ప్రసంగమూ ఉండదు. 

పవన్ తన గురించి తాను విశ్వమానవుడిని అని చెప్పుకుంటారు. తనకు కులమతాలు లేవని అంటారు. కానీ మైకు ముందుకు రాగానే కులం గోల ఎత్తకుండా ఉండలేరు. ‘అధికారంలో మీ ఒక్క కులమే ఉండాలా?’ అనేది పవన్ కల్యాణ్ కడుపుమంట. తన కులానికి పదవి కావాలని అనరు. కానీ మీకులం మాత్రమే అధికారంలో ఉండడడం కుదరదు అంటారు. తాను అధికారంలోకి వస్తే అన్ని కులాలకు అధికారం ఇస్తానని అంటారు. ఆయనలోని అవివేకానికి ఇది పరాకాష్ట. లేదా, అస్పష్ట ప్రకటనతో ప్రజలను వంచించే వైఖరికి ఇది పరాకాష్ట! ఏ పార్టీ గెలిచినా ఒక వ్యక్తి, ఒక కులానికి చెందిన వ్యక్తి మాత్రమే అధికారంలోకి వస్తాడు గానీ.. అన్ని కులాలకు ఒకేసారి అధికారం ఎలా సాధ్యమవుతుంది. ఈ కామన్ సెన్స్ పవన్ మాటల్లో ఉండదు.

మీరందరూ కాంట్రాక్టులు చేసి సంపాదించుకుంటున్నారు.. నాకు ఆ సంపాదన లేదు.. అనేది పవన్ అతి తరచుగా మొత్తుకునే మరో మాట! ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంపాదన మార్గం ఉంటుంది. పవన్ కు సినిమాలు ఉన్నట్టే. ఆ మార్గంలో వారు వీలైనంత లాభపడే ఆలోచనతో చేస్తుంటారు. రోజుకు నాలుగు కోట్ల సొమ్ములు.. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నిర్మాతల ముక్కు పిండి వసూలు చేసుకునే పవన్ కల్యాణ్.. రోజుకు తన రెమ్యునరేషన్ రెండు కోట్లు అని బుకాయిస్తున్నట్టుగానే.. ఎవరి బుకాయింపులు వారికి ఉంటాయి. 

రాష్ట్రం నాశనమైపోతుంది, ప్రజలు నష్టపోతారు.. అనే స్వీపింగ్ స్టేట్మెంట్లు తప్ప.. ఎలా అని చెప్పగలిగే నాలెడ్జి పవన్ కు ఉండదు. షాట్ గ్యాప్ లో పార్టీ మీటింగులో, షెడ్యూలు గ్యాప్ లో ప్రజల మధ్యకు యాత్రలు సాగించే ఈ నటుడు.. తదనుగుణంగా నాలెడ్జి పెంచుకునే ప్రయత్నం కూడా చేయరు. 

కేసీఆర్.. ఉభయులను తిట్టడమే సమస్య!

ప్రజల నమ్మకం తనకు ఉన్నదని మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అవుతాననేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా. అయితే ఎర్రకోట మీద కూడా గులాబీ జెండా ఎగరేయాలనేది కల. అది ఎలా అనేదే ప్రజలకు అర్థం కాని సంగతి. దానికి తగినట్టుగా ఆయన ఇతరుల నమ్మకాన్ని పొందలేకపోతున్నారు. 

బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలను కేసీఆర్ సమానంగా తిడుతుంటారు. కానీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోరుకుంటున్నప్పుడు, తెలంగాణ సింహాసనం మీద కొడుకును కూర్చోబెట్టాలని కోరుకుంటున్నప్పుడు.. ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీతో తెరవెనుక లాలూచీ ఉన్నదనేది అందరికీ అనుమానం. ప్రధానంగా బిజెపితో కుమ్మక్కు అయి, మోడీని మళ్లీ కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి, దేశంలో మోడీ వ్యతిరేక ఓటును చీల్చడానికి కేసీఆర్ జాతీయ పార్టీగా అవతరించి రాజకీయం చేస్తున్నారనేది ప్రధానంగా వినిపించే విమర్శ.

మోడీ సర్కారు మీద గంపగుత్తగా గులాబీ దళం మొత్తం విమర్శలు కురిపించడం తప్ప.. నిర్దిష్టంగా కుమ్మక్కు విమర్శలు అబద్ధం అనిపించేలా.. జాతీయ రాజకీయాల్లో ఇతర మోడీ వ్యతిరేక పార్టీలతో స్నేహబంధాలను కేసీఆర్ నిర్మించుకోలేకపోవడం ఆయన వైఫల్యం. మోడీ వ్యతిరేక కూటమిగా జట్టుకడుతున్న ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు ఎవ్వరూ కూడా కేసీఆర్ ను తమ విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. 

మోడీ.. మతం- రాముడు- హనుమంతుడు!

ప్రధాని నరేంద్రమోడీ.. దార్శనికుడైన నాయకుడు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కావొచ్చు- కాకపోవచ్చు. కానీ మతాన్ని అడ్డుపెట్టుకోకుండా మాట్లాడడం ఆయనకు సాధ్యమవుతుందా? కాదా? అనేదే ఇక్కడ చర్చ! సాధారణంగా వ్యాపారం అయినా, వ్యక్తులు అయినా ఎదిగే క్రమంలో కొన్ని పొరబాట్లు, తెలిసితెలిసీ తప్పులు చేస్తుంటారు. ఎదిగిన తర్వాత.. వాటికి దూరం జరిగి తమ నడకను పద్ధతిగా తయారుచేసుకోవాలి. 

భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఒకప్పుడు కేవలం రెండేసీట్లకు పరిమితమై ఉన్న రోజుల్లో రాముడిని ఒక అస్త్రంగా వాడుకుంది. మతాన్ని ట్రంప్ కార్డు అనుకున్నది. అది వారికి వర్కవుట్ అయింది. ఆ మత్తు వారికి ఇంకా దిగలేదు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మోడీ నేతృత్వంలో బిజెపి సర్కారు ఏర్పడిన తర్వాత.. మతాన్ని వాడుకోవాల్సినంత అవసరం లేని సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. అయినా సరే.. మోడీ మతపరమైన ఉద్వేగాల్ని రెచ్చగొట్టకుండా ఇవాళ్టికీ మాట్లాడలేకపోతున్నారు. 

తన పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేదనే భయం ఉన్నప్పుడే నాయకులకు ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి వక్రమైన ఆలోచనలు వస్తాయి. నిన్నటిదాకా బిజెపి అచ్చంగా రాముడినే నమ్ముకున్నది. రాముడి జపం చేస్తూ.. ఆయనను ఓట్లు వేయించే మెషిన్ లాగా వాడుకున్నది. రామమందిరం గురించి తీర్పు వచ్చేసిన తర్వాత.. మందిరం నిర్మాణం జరుగుతుండగా.. దానిని వచ్చే ఎన్నికల నాటికి పూర్తిచేసి.. రాముడి ద్వారా చివరిసారిగా లబ్ధి పొందాలని  భావిస్తున్నది. అలాంటి బిజెపికి కన్నడ ఎన్నికల్లో హనుమంతుడు కొత్త అస్త్రంగా దొరికాడు. 

బజరంగ్ దళ్ వంటి సంస్థల్ని నిషేధిస్తాం అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నందుకు మోడీ ఇక ఆ హనుమను పట్టుకున్నారు. హనుమ పుట్టిన రాష్ట్రంలో ఆయనకు ఇది అవమానం అంటూ.. బజరంగదళ్ అనేది సాక్షాత్తూ హనుమంతుడు స్థాపించిన సంస్థ అన్నట్టుగా ఆయన దూకుడు ప్రదర్శించారు. హనుమంతుడంటే మీకు ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. 

మతాన్ని వాడుకోకుండా, మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టకుండా మాట్లాడడం ఇంత గొప్ప నాయకుడికి చేతకాదా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. 

ఈ పోకడలు, నాయకులు వాడుతున్న మాటలు వర్తమాన రాజకీయం పతనానికి రుజువులు. ప్రజాస్వామ్యానికి సోకిన చెదలు! ప్రధాన నాయకుల, ప్రధాన మాటలు ఇవి అయితే.. బూతులు మాట్లాడేవాళ్లూ నీచమైన భాషలో రెచ్చిపోయే వాళ్లు పద్ధతైన విమర్శ అంటే అర్థం కూడా తెలియని ధూర్తులూ మన రాజకీయాల్లో అనేకులు ఉన్నారు. వారందరి గురించి చెప్పుకోవడం కూడా దండగ. కనీసం ఈ స్థాయిలో ఉన్న పెద్ద నాయకులైనా మారితే బాగుంటుంది అనేది ప్రజల ఆశ.

.. ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?