హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సాధారణంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రారు. చంద్రబాబునాయుడి అరెస్ట్ తర్వాత చేపట్టిన అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో అల్లరి చేసి రెండు తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీలో అడుగు పెట్టిన మొదలు… బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళానికి టీడీపీ తెరలేపింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పుతూ వైసీపీ సభ్యుల్ని రెచ్చగొట్టారు. మంత్రి అంబటి రాంబాబు రా.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. సినిమాల్లో మీసాలు తిప్పుకోవాలని చురకలు అంటించారు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారామ్ సీరియస్‌గా స్పందించారు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్టు ప్రకటించారు. సభను అగౌరవపరిచేలా నడుచుకోవద్దని హితవు పలికారు.
బాలయ్య మీసం తప్పడంపై వైసీపీ సభ్యులు ఘాటుగా స్పందిస్తున్నారు. బాలయ్య సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను తీసుకుని ఆయనకే వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ప్లూటు జింక ముందు ఊదు, సింహం ఎదుట కాదనే డైలాగ్‌ను కొంచెం మార్చి… మీసం చంద్రబాబు ముందు తిప్పు, వైసీపీ ఎదుట కాదని ఆ పార్టీ నేతలు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
సినిమాల్లో వ్యవహరించినట్టు అసెంబ్లీలో, వైసీపీ నేతల వద్ద పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే దబిడి దబిడే అని బాలయ్యకు వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి బాలయ్యకు సినిమా డైలాగ్‌లోనే వైసీపీ ఓ రేంజ్‌లో చితక్కొడుతోంది.