బెందాళం అశోక్‌ను ఓడించాల్సిందే!

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఎంతలా అంటే టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటికి తొమ్మిది ఎన్నికలు జరిగితే 2004 ఎన్నిక తప్ప మిగిలిన అన్ని ఎన్నికలలోనూ ఆ పార్టీ ఘన…

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఎంతలా అంటే టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటికి తొమ్మిది ఎన్నికలు జరిగితే 2004 ఎన్నిక తప్ప మిగిలిన అన్ని ఎన్నికలలోనూ ఆ పార్టీ ఘన విజయం సాధించింది.

2004లో మాత్రం కాంగ్రెస్‌ గెలిచింది. ఆ పార్టీ నుంచి నాలుగుసార్లు ఎంవీ కృష్ణారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 నుంచి రెండుసార్లు బెందాళం అశోక్‌ గెలిచారు. 2024లో కూడా ఆయనకే టిక్కెట్‌ అని టీడీపీ అధినాయకత్వం చెప్పేసింది అంటున్నారు. ఇప్పటికే జనంలోకి వెళ్లి అశోక్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనను ఈసారి ఎలాగైనా ఓడించాలన్నది వైసీపీ అధినాయకత్వం పంతంగా ఉంది.

2014లో 20 వేలకు పైగా మెజారిటీ సాధించిన అశోక్‌ను 2019 నాటికి ఏడు వేలకు తగ్గించిన వైసీపీ ఈసారి ఓటమి ఏమిటో చూపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయిన పిరియా సాయిరాజ్‌కు 2019లో టిక్కెట్‌ ఇస్తే గట్టి పోటీ ఇచ్చారు. ఇపుడు ఆయన సతీమణి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అయిన పిరియా విజయకు టిక్కెట్‌ ఇస్తున్నారు.

సాయిరాజ్‌ కళింగ సామాజికవర్గం అయితే విజయ కాపు సామాజికవర్గంగా చెబుతున్నారు. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. యాదవ సామాజికవర్గం ఓట్లు కూడా ఆ విధంగా తోడు అవుతాయని వైసీపీ అంచనా వేస్తోంది.

రెండుసార్లు గెలిచిన అశోక్‌ మీద సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉందని, సొంత పార్టీలో కూడా టిక్కెట్‌ రాని వారి అసంతృప్తి ఉందని ఈ లెక్కలతో ఈసారి ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగురవేయాలని వైసీపీ చూస్తోంది.