బీజేపీతో ఇటీవల ప్రేమలో పడ్డ ఆంధ్రజ్యోతి కొత్త మోజులో మోతాదుకు మించి సరసాలాడుతున్నట్టు కనిపిస్తోంది. మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకున్న చందానా…బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాననే ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి మరీ బరి తెగించింది. అందుకు ఈ వేళ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ‘జగన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్!’ శీర్షికతో ప్రచురిం చిన కథనమే నిదర్శనం.
ఈ కథనమంతా చదివితే ఏపీ బీజేపీ నేతలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జగన్ అపాయింట్‌మెంట్‌ను చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రద్దు చేసినట్టు అర్థమవుతోంది. కానీ ఇదే కథనంలో ‘నిసర్గ’ తుఫాను మహారాష్ట్ర, గుజరాత్‌లను తాకనున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు సమాలోచనలు జరుపుతూ అమిత్ షా బిజీగా ఉన్నారని, అందువల్ల ఆయన ముఖ్యమంత్రిని కలుసుకోలేనని చివరి నిమిషంలో చెప్పారని హోం శాఖ వర్గాలు తెలిపాయని రాస్తూనే మరో కట్టు కథను ఆంధ్రజ్యోతి అల్లింది.
అబద్ధాలాడినా అతికినట్టుండాలని పెద్దలు చెబుతారు. అందుకే జగన్‌ను బద్నాం చేయాలనే ఆంధ్రజ్యోతి ప్రయత్నం పాఠకులను మెప్పించలేకపోయింది. పాఠకులను రంజింపజేయడానికి నైతిక విలువల వలువలను విడిచి నర్తిస్తున్న ఆంధ్రజ్యోతిని చూస్తుంటే సిగ్గేస్తోంది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపునకు సంబంధించి తాము నియమించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయడంపై కేంద్ర పెద్దలు అసంతృప్తితో ఉన్నట్టు ఆంధ్రజ్యోతికి సమాచారం అందిందట. అంతేకాదు, ఆ ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడం, దానిపై మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం తదితర అంశాలపై కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు జగన్ వస్తున్నారని తెలిసినందు వల్లే అపాయింట్‌మెంట్ రద్దు చేశారని ఆంధ్రజ్యోతికి రాత్రి కలలో బీజేపీ నేతలు చెప్పారట. దాన్నే కథనంగా వండారట.
అంతేకాదు, అడిగినప్పుడల్లా జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఏంటని ఏపీ బీజేపీ నేతలు మోదీ, అమిత్‌షాలకు చీవాట్లు పెట్టడంతో వాళ్లు భయపడ్డారట. అసలు జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అయితే జగన్ మొహం చూడడానికే ఇష్టపడలేదని ఆంధ్రజ్యోతికి అత్యంత విశ్వసనీయ సమాచారం అందిందట. ఏపీలో బీజేపీ బలోపేతం కావాలంటే జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని రాష్ట్ర నేతలు కేంద్రానికి ఉపదేశించారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. రాష్ట్ర బీజేపీ నేతల నివేదిక ఆధారంగానే జగన్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను అమిత్‌షా చివరి క్షణాల్లో రద్దు చేసినట్టు బీజేపీ వర్గాలు ఆంధ్రజ్యోతికి చెవిలో చెప్పాయని రాసుకొచ్చారు.
ఆంధ్రజ్యోతి రాత ప్రకారం ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ఖరారైన పరిమళ్ నత్వానీ అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ వ్యూహం ప్రకారం అసలు జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇస్తేనే నష్టం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు , తమ కోటాలో రాజ్యసభ పదవి తీసుకోవడం మరింత నష్టం చేసే అవకాశాలే ఉంటాయి. ఇదే ఆంధ్రజ్యోతి గత మార్చి నెల 10న మొదటి పేజీలో ‘మోదీ, షాల నేస్తం నత్వానీ’ అనే శీర్షికతో ఓ కథనం రాసింది. ఆ కథనంలో ఏం రాసిందో ఈ సందర్భగా తప్పక తెలుసుకోవాలి.
‘‘ ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ఖరారైన పరిమళ్ నత్వానీ పేరు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు అంతగా సహించదు. గుజరాత్‌కు చెందిన ఆయన మోదీ, అమిత్ షాలకు సన్నిహితమైన కొద్దీ కాంగ్రెస్‌కూ, ముఖేష్ అంబానీకి మధ్య దూరం పెరగడమే దీనికి కారణం. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీకి న్యాయసలహాలు అందించారని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. జార్ఖండ్ నుంచి రాజ్యసభకు నత్వానీ ఎన్నికవ్వాలనుకున్నప్పుడు ఆయనకు 24 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం కాగా, అమిత్ షా జోక్యంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారని ఈ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా అమిత్ షా సూచన వల్లే నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ సిద్దపడ్డారని తెలుస్తోంది’’ అని రాశారు.
అమిత్‌షా సూచన వల్లే నత్వానీకి రాజ్యసభ సీటును ఏపీ సీఎం జగన్ ఇచ్చారని ఇదే ఆంధ్రజ్యోతి గత మార్చిలో రాసింది. ఇప్పుడేమో జగన్‌తో మాట్లాడితే ఏపీలో బీజేపీ బలోపేతం కాలేదని రాష్ట్ర నేతలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అపాయింట్ మెంట్‌ను రద్దు చేశారని రాసింది. ఇందులో ఏది కరెక్ట్? ఆంధ్రజ్యోతికి ఒక పాలసీ అంటూ లేదా? ఏ పాలసీ లేకపోవడమే ఆంధ్ర జ్యోతి పాలసీనా? ఏంటీ వక్రభాష్యాలు? కనీసం నవ్వుతారనే ఆలోచన కూడా లేదా? జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ఇంత దిగజారి రాయాలా? ఉన్నట్టుండి ఏపీ బీజేపీ నేతలు అంత గొప్ప వాళ్లగా కనిపిస్తున్నారా? అవున్లే బీజేపీ ఒడిలో సేదదీరుతుంటే లోకం ఏమైపోతున్నదో ఆంధ్రజ్యోతి కంటికి కనిపిస్తున్నట్టు లేదు.