పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తమ అభిమాన హీరో, నాయకుడి విధానాలను ముద్దుగా పవనిజం పేరుతో పిలుచుకుంటారు. మిత్రుడి సహాయంతో పవన్‌కల్యాణ్ ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశారు. కమ్యూనిస్టులు తమ సిద్ధాంతకర్త మార్క్స్ ఫిలాసఫీని మార్క్సిజం పేరుతో పిలుచుకుంటారు. ప్రతి ఒక్కరూ తమకంటూ మార్గదర్శకులుగా భావించే వాళ్ల విధివిధానాలను ఇజం పేరుతో ఫాలో అవుతుంటారు.
మానవతావాదులు హ్యూమనిజం తమ మతంగా చెప్పుకుంటారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా ఎమ్మెల్యే జోగి రమేశ్ బ్రోకరిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఇద్దరి పేర్లు చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు, మీడియా రంగంలో వేమూరి రాధాకృష్ణ పేర్లను ఆయన ఉదహరించారు. ఆంధ్రజ్యోతిది బ్రోకరిజమని, ఆ పత్రిక యజమాని ఓ బ్రోకర్ అని జోగి రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్‌కేపై ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాబేదారుగా వ్యవహరిస్తున్న ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ ఓ బ్రోకర్ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతి నిధి, ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేమూరి రాధాకృష్ణ గురించి రమేశ్ ఏమన్నారంటే….
*ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులైన కలెక్టర్లను కించపరుస్తూ వారి మనోభావాలు దెబ్బ తీసేలా కుట్రతో రాధాకృష్ణ చౌదరి తప్పుడు రాతలు రాశారు.
*జగన్ ప్రభుత్వాన్ని, జగన్‌ను గానీ ఏమీ చేయలేక కలెక్టర్లను టార్గెట్ చేసి ఆంధ్రజ్యోతిలో హనీ ట్రాప్ అంటూ దిగజారుడు రాతలు రాశారు.
*జగన్ పాలనలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేందుకు తన పత్రికను, మీడియాను ఉపయోగిస్తున్నాడు.
*రాజకీయాల్లో బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబే. ఈ విషయాన్ని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. అలాంటి బాబుకు రాధాకృష్ణ చౌదరి కూడా బ్రోకరిజం చేస్తున్నాడు.
*ఆంధ్రజ్యోతి పత్రిక కూడా బ్రోకరిజం ద్వారానే వచ్చింది.
*గతంలో మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎలా ట్రాప్ చేశారో , వారిని రాధాకృష్ణ గెస్ట్‌హౌస్‌లకు పిలిపించి ఏ విధంగా లోబరుచుకున్నారో అందరికీ తెలుసు.
మీడియా సంస్థగా, అధిపతిగా ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ తమ పని తాము చేయకపోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు రాజకీయ ఎజెండాను మోస్తూ ప్రత్యర్థులపై బురదచల్లే కార్యక్రమాలకు పాల్పడుతుండడం వల్ల రాజకీయ, మీడియా రంగాలకు మధ్య ఉన్న సత్సంబంధాలు తెగిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.