తెలకపల్లి రవి…ప్రముఖ సంపాదకుడిగా, సీనియర్ జర్నలిస్లుగా, అన్నిటికి మించి తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పే అతికొద్ది మంది విశ్లేషకుల్లో అగ్రగణ్యులు. చానళ్లను బట్టి అభిప్రాయాల్ని చెప్పే విశ్లేషకులున్న కాలంలో …. అలాంటి వాళ్లకు భిన్నంగా తెలుగు సమాజంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి లాంటి ఒకరిద్దరి పేర్లు మాత్రమే ప్రముఖంగా చెప్పుకునే దయనీయ స్థితిలో మనం ఉన్నాం.
వీళ్లిద్దరూ కూడా మార్క్సిస్ట్ మేధావులుగా, చానళ్లు, పత్రికల రాజకీయాభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ల యజమానుల మెప్పు కోసం కాకుండా , సమాజ శ్రేయస్సు , భావితరాల భవిష్యత్ గురించి కలలు కనే ముందు చూపున్న విశ్లేషకులుగా ఉండడం వల్లే తెలకపల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్లకు తెలుగు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కాయి.
ఇటీవల కాలంలో సొంత రాజకీయ ఎజెండాతో చానళ్లలో డిబేట్లు నిర్వహిస్తుండడంతో ఇలాంటి తటస్థులకు క్రమంగా స్థానం కనుమరుగవుతోంది. అయితే సమాజం పట్ల నిబద్ధత ఉన్న మేధావి వర్గంగా సొంత యూట్యూబ్ చానళ్లను ఏర్పాటు చేసుకుని దేశ, తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రజల వైపు నుంచి నిఖర్సైన, నిజాయితీతో కూడిన విశ్లేషణలు, విమర్శలు చేస్తుండడం చూస్తున్నాం.
సహజంగా తెలకపల్లి రవి విధానపరమైన అంశాలు, నిర్ణయాలపై విశ్లేషణలు చేస్తుంటారు. వ్యక్తిగత పొగడ్తలు, దూషణలకు ఆయన దూరంగా ఉంటారు. బహుశా టీవీ డిబేట్లలో ఆయన ఆగ్రహాన్ని ఒకే ఒక్కసారి చూసి ఉంటాం. అది కూడా టీడీపీ మహిళా నాయకురాలు మంచువర్తి అనురాధ అందర్నీ మాట్లాడినట్టే….తెలకపల్లిపై కూడా నోరు పారేసుకున్న సందర్భంలో ఆయన ఫైర్ అయ్యారు.
అలాంటి ధర్మాగ్రహాన్ని మరోమారు తెలకపల్లి రవిలో తాజాగా తన సొంత యూట్యూబ్ చానల్‌లో చేసిన ఓ వీడియోలో ఆంధ్రజ్యోతిపై చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ఈ రోజు ‘అరాచకానికి అడుగే దూరం’ శీర్షికతో ఓ బ్యానర్ కథనం రాశారు. ఈ కథనానికి సబ్ హెడ్డింగ్స్ కింద..‘ఒకప్పటి బిహార్, యూపీని తలపిస్తున్న ఏపీ’ , ‘దళితులపై పెరుగుతున్న దాడులు’, ‘తప్పు పట్టాలంటే వణుకుతున్న తటస్థులు’…ఇంకా మరికొన్ని ఉన్నాయి.
ఈ కథనంలో తప్పు పట్టాలంటే వణుకుతున్న తటస్థులు అని రాయడం తెలకపల్లి రవిని హర్ట్ చేసినట్టు …. ఆయన చేసిన వీడియోను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి అక్షరాలే అరాచకమని ఆయన తీవ్రస్థాయిలో తెలకపల్లి మండిపడేం తగా ఆ కథనం కోపం తెప్పించింది. తెలకపల్లి మేధావి, తటస్థ విశ్లేషకుడికే ఆవేశం , ఆగ్రహం తెప్పించిందంటే … ఆంధ్రజ్యోతి అక్షరం ఎంత దుర్మార్గంగా ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రజ్యోతి కథనంలో తటస్థుల గురించి ఏం రాశారో ముందుగా తెలుసుకుందాం.
‘నోరెత్తాలంటే భయమే..’ అనే సబ్ హెడ్డింగ్ కింద తటస్థులపై ఆంధ్రజ్యోతి తన అక్కసంతా వెళ్లగక్కింది. అది ఇలా…
‘గతంలో ప్రభుత్వ విధానాల్లోని మంచి చెడ్డలపై తటస్థ నిపుణులు, విశ్లేషకులు, సామాజిక వేత్తలు స్వేచ్ఛగా మాట్లాడేవారు. ఇప్పుడు… అంతా గప్‌చుప్. ప్రభుత్వ విధానాల్లోని తప్పులను ఎత్తి చూపేందుకు వణికిపోతున్నారు. ఎవరైనా ధైర్యంగా మాట్లాడితే… సోషల్ మీడియాలో దాడులు జరుగుతాయి. బెదిరింపులూ తప్పవు. దీంతో… విపక్ష నేతలు మినహా మిగిలిన వారంతా గప్‌చుప్! పీఆర్సీ ఇవ్వకున్నా, ఐఆర్‌లు మంజూరు చేయకున్నా ఉద్యోగ సంఘాల నేతలు నోరెత్తడంలేదు. ఉన్నత స్థాయి అధికారులు సైతం… ఫోన్లలో మాట్లాడాలంటే భయపడుతున్నారు’
ఈ వాక్యాలే తెలకపల్లికి కోపం తెప్పించింది. ఎందుకంటే ఈ అక్షరాల్లో నిజం లేదు కాబట్టి. తటస్థులను, మేధావులను అవమా నపరిచేలా ఆ వాక్యాలు ఉండడం వల్లే తెలకపల్లి రవి సీరియస్ స్పందించారు. తెలకపల్లి తన విశ్లేషణలో ఆంధ్రజ్యోతి కథనంపై ఏ విధంగా తన అభ్యంతరాన్ని, నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారో తెలుసుకుందాం. ఆ వీడియోలో ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్యమైనవిగా భావించిన వాటిలో కొన్ని వాక్యాలు ….
‘ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో కథనం. బిహార్, ఉత్తరప్రదేశ్‌లని పదేపదే ప్రస్తావిస్తూ వాటిని అవమానించడం ఎందుకో తెలియదు. వాటిని పాలించే బీజేపీని వాళ్లు బాగానే పొగుడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక తప్పులు, పొరపాట్లు, తొందర పాట్లు ఉండొచ్చు. కానీ అంత అరాచకం తాండవిస్తోందని, అటవీ రాజ్యం ఉందని అప్పుడే చెప్పగలమా? ఇదొక పెద్ద ప్రశ్న. రెండోది అరాచకం అనేది అడ్మినిస్ట్రేషన్‌లోనే కాదు అక్షరంలో కూడా ఉంటుంది కదా! ఈ కథనం ఎంత అరాచకంగా ఉందంటే … ముఖ్యంగా మాకు సంబంధించింది అంటున్నారు కాబట్టి ఎవరూ మాట్లాడ్డం లేదట! వణుకుతున్న తటస్థులట! ఎవరు వణుకుతున్నారు?
ఇప్పుడు విపక్షం మాత్రమే విమర్శంటే ఆంధ్రజ్యోతిలాగా, ఆర్‌కేలాగా, లేక ఇంకొకరు కోరుకుంటున్నట్టుగా చేస్తేనే విమర్శనా? ఎవరి పద్ధతుల్లో వాళ్లు విమర్శలు చేయరా? ఆ మాటకొస్తే నరేంద్రమోడీ మతతత్వాన్ని నేను విమర్శించినట్టు ఆయన (ఆర్‌కే) విమర్శిస్తారా? లేదే! నేను కావచ్చు, ఇంకో విశ్లేషకుడు కావచ్చు…. ఎవరూ గప్‌చుప్ అయిపోలేదు. గప్‌చుప్ అయిపోయారని ఆరోపించడం చాలా ఘోరం.
అలాగే ఉద్యోగ సంఘాలు , అందరూ ప్రభుత్వానికి లోబడిపోయారని ఒక వాక్యం. మళ్లీ అదే కథనంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు తదితరులు ధర్నా చేశారని రాశారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద అది ఆపేశారు అని రాశారు. ఆపేయడం అనేది చంద్రబాబు హయాంలోనే జరిగింది. మీరప్పుడు రాయలేదు. ఇప్పుడు రాస్తున్నారు. అది కూడా చాలా తక్కువగా రాస్తున్నారు. ప్రజా ఉద్యమాలు, సంఘాల గురించి ఎక్కడ రాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గొంతు మీద కత్తి పెట్టి మీటర్లు బిగింపజేస్తే … కేంద్రానికి సంబంధం లేదని మీరు రాస్తున్నారు.
తెలుగు మీడియం, రైతుల కరెంట్‌కు మీటర్లు, మూడు రాజధానులు, సోషల్ మీడియా, మీడియా మీద దాడుల గురించి మాట్లాడాను. మీరు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో ఎవరికి తెలియదు. వణుకుతున్న తటస్థులు, గప్‌చుప్ అయిపోయారని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆలోచన పరులను, బుద్ధి జీవులను, మీడియాను, విమర్శకులను, విశ్లేషకులను అందర్నీ మీరు అవమానించడం కంటే అరాచక రాతలు ఏముంటాయ్?.
మతతత్వం మీద, కేంద్రప్రభుత్వ విధానాల మీద, ఇతర రాష్ట్రాల మీద ఏ మేరకు రాస్తున్నారు? మీరు గప్‌చుప్‌గా ఉన్నట్టా? అసలు ఆ మాటకొస్తే వైసీపీ మీద కూడా మీరు రాసే దాంట్లో విరుచుకుపడిన రోజులు, సన్నాయి నొక్కిన రోజులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని అంశాలు మాలాంటి వాళ్లు చూపించిన తర్వాత టేకప్ చేయలేదు. వాక్యాలతో సహా చూపిస్తాను నేను. అందుకే ఒక్కసారిగా తటస్థులందరూ వణికిపోతున్నారు , మేధావులందరూ జంకిపోతున్నారు, గప్‌చుప్ అయిపోతున్నారు…ఇదొక పెద్ద ప్రచారం.
తెలుగుదేశం మీద అభిమానం ఉండొచ్చు, చంద్రబాబే సర్వస్వం అనుకోవచ్చు. నాకు కూడా చంద్రబాబు సన్నిహితుడే, గౌరవనీయులు, రాష్ట్రాన్ని చాలా కాలం పాలించారు. కానీ విమర్శలు చేయరా? చంద్రబాబును అనాలంటే జగన్‌ను పొగడాలా? ఇక మాలాంటి వాళ్లకే వ్యక్తిత్వం ఉండదా? కాబట్టి ఆంధ్రజ్యోతి ఆ విధంగా బ్యానర్‌లో వాడడం చాలాచాలా పొరపాటు. అందరూ గప్‌చుప్ అయిపోయారనడం చాలా తప్పు అని చెప్పడానికి నేనిప్పుడు చేస్తున్న వీడియోనే నిదర్శనం. ఎవరూ గప్‌చుప్ కాలేదు. పెద్దపెద్ద ఉద్యమాలు, ఉద్రేకాలు, బెదిరింపులున్నప్పుడే గప్‌చుప్ కాలేదు. ఇప్పుడెందుకవుతారు?
దళితులపై దాడుల్ని ఖండించలేదా? మీరు చెప్పినట్టే ఖండించాలా? మీ భాషనే వాడాలా? ఒక కన్నే తెరిచి ఇంకో కన్ను మూసుకోవాలా?
వణుకుతున్నారేంటండి? ఎవరు వణుకుతున్నారు. నాలుగు పేర్లు చెప్పండి. రాయండి లేకపోతే ఫలానా వాళ్లు వణుకుతున్నారని. అలాగే వైసీపీ ప్రభుత్వం యొక్క ఏ చర్య విమర్శకు గురి కాలేదు, విమర్శకులు ఎప్పుడు మౌనం పాటించారో చెప్పండి. ఆంధ్రజ్యోతి కథనం మేధావులను, ఆలోచనాపరులను, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చైతన్యాన్ని అవమానపరిచేలా ఉంది. ఎవరూ వణకడం లేదు. జగన్ ప్రభుత్వంలో తప్పులను ఖండించడంలో ఎవరూ వెనకడుగు వేయడం లేదు.
తటస్థులు వణుకుతున్నారు, మేధావులు గప్‌చుప్ అయిపోయారు, విమర్శకులు మూగబోయారు… అని రాయడం ఒక అరాచకానికి, అక్షరాలలో అరాచకానికి నిదర్శనం. దాన్ని సవరించుకుంటారేమో చూద్దాం’ అని ఘాటుగా తెలకపల్లి రవి రిప్లై ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అరాచక రాతలపై తెలకపల్లి రవి స్పందన ప్రశంసలు అందుకుంటోంది.