నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రిమాండ్ లో ఉన్న సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రబొర్తి సంచలన విషయాల్ని వెల్లడిస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. సుశాంత్ తో పాటు మాదకద్రవ్యాలు సేవించే పాతిక మంది సినీ ప్రముఖల లిస్ట్ ను ఆమె ఇప్పటికే ఎన్సీబీకి అందించినట్టు వార్తలు రాగా.. తాజాగా సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసింది ఎవరనే విషయంపై కూడా రియా స్పందించిందట.
తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ ఫిలిం మేకర్, సుశాంత్ కు డ్రగ్స్ సేవించడం అలవాటు చేశాడని రియా ఆరోపిస్తోంది. అతడి పేరును ఎన్సీబీకి ఆల్రెడీ చెప్పేసిన రియా.. సుశాంత్ తో రిలేషన్ షిప్ లో ఉన్న టైమ్ లో అతడు ఈ విషయాన్ని తనకు చెప్పినట్టు వెల్లడించింది. ఈ మేరకు 20 పేజీల స్టేట్ మెంట్ ను ఎన్సీబీ అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది.
సుశాంత్ తో పాటు ఈ బ్యాచ్ అంతా ఎక్కడ డ్రగ్స్ వాడుతారనే విషయాన్ని కూడా రియా వెల్లడించింది. సుశాంత్ కు చెందిన లోనావాలా ఫామ్ హౌజ్ లో ఈ తరహా డ్రగ్స్ పార్టీలన్నీ జరుగుతాయట. 2-3 సార్లు ఆ పార్టీలకు తను కూడా వెళ్లానని, అక్కడ డ్రగ్స్ వాడకాన్ని చూశానని చెప్పిన రియా.. తను మాత్రం మాదకద్రవ్యాలు సేవించలేదని చెప్పింది.
ఎప్పటికప్పుడు సుశాంత్, బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలకు తన ఫామ్ హౌజ్ లో డ్రగ్ పార్టీలు ఇచ్చేవాడని తెలిపిన రియా.. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు పవర్ ఫుల్ అండ్ పాపులర్ హీరోలు సుశాంత్ కు ఈ డ్రగ్స్ ఎప్పటికప్పుడు ఇచ్చేవారని తెలిపింది. ఈ మేరకు ఈ విషయాలన్నీ గుదిగుచ్చుతూ ఓ సెక్షన్ బాలీవుడ్ మీడియా వరుస కథనాల్ని ప్రసారం చేస్తోంది.
మరోవైపు సుశాంత్ మరణానికి సంబంధించిన కేసులో డ్రగ్స్ కోణానికి సంబంధించి ఎన్సీబీ అధికారులు మరో డ్రగ్ సరఫరాదారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి బాలీవుడ్ ప్రముఖులతో సత్సంబంధాలున్నాయని ప్రాధమికంగా గుర్తించిన అధికారులు.. కొకైన్, ఎల్ఎస్డీ, మరిజువాలా లాంటి మాదకద్రవ్యాల్ని ఇతడు పలువురికి సరఫరా చేస్తున్నాడనే విషయాన్ని గుర్తించారు.