బీజేపీపై మంత్రి వెల్లంప‌ల్లి ఫైర్‌…ఇది క‌ల కాదు క‌దా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారతీయ జ‌న‌తా పార్టీకి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నోటా (న‌న్ ఆఫ్ ది ఎబౌవ్‌) కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకే కాదు మ‌రో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ది కూడా అదే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారతీయ జ‌న‌తా పార్టీకి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నోటా (న‌న్ ఆఫ్ ది ఎబౌవ్‌) కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకే కాదు మ‌రో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ది కూడా అదే దుస్థితే. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నోటా ఓట్ల శాతాన్ని ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వు తుంది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌కు 1.29 శాతం, భార‌తీయ జ‌న‌తా పార్టీకి 0.96 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఇదే లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల్లో నోటాకు 1.49 శాతం ఓట్లు వ‌చ్చాయి.

ఇక అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 1.17 శాతం, బీజేపీకి 0.84 శాతం, నోటాకు 1.28 శాతం ఓట్లు వ‌చ్చాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి మొత్తం 3,03, 806 ఓట్లు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 2,64,303 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌కు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 4,06,568, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 3,68,878 ఓట్లు ద‌క్కాయి. ఇక నోటాకు వ‌చ్చిన ఓట్టు ఎన్నో తెలుసుకుందాం. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 4,69,863 ఓట్లు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 4,01,969 ఓట్లు వ‌చ్చాయి. అంటే రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వ‌చ్చిన విష‌యాన్ని గ‌మ‌నించొచ్చు.

దేశాన్ని బీజేపీ రెండోసారి ఏలుతున్న‌ప్ప‌టికీ….ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ బ‌లం నోటా కంటే త‌క్కువే. కానీ కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో ఆ పార్టీ ఆడుతున్న డ్రామాలు అన్నీఇన్నీ కావు. సీబీఐ, ఈడీ, ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల్ని త‌మ గుప్పిట్లో పెట్టుకుని పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను త‌మ అదుపాజ్ఞ‌ల్లో ఉంచుకుని ఏపీపై బీజేపీ అన‌ధికార పెత్త‌నం సాగిస్తోంది. ప్ర‌శ్నించే రాజ‌కీయ పార్టీలు లేవ‌నే ధీమాతో బీజేపీ నేత‌లు చెల‌రేగిపోయి మాట్లాడుతున్నారు.

స‌రిగ్గా గ‌త శ‌నివారం ఇదే రోజు అర్ధ‌రాత్రి అంతర్వేదిలో శ్రీ‌ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి ర‌థం ద‌గ్ధం కావ‌డాన్ని అవ‌కాశంగా తీసుకున్న బీజేపీ -జ‌న‌సేన చేసిన గంద‌ర‌గోళం అంతాఇంతా కాదు. ఈ పార్టీల‌కు మ‌రో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తోడు కావ‌డంతో అగ్నికి వాయువు క‌లిసిన‌ట్టైంది. జ‌గ‌న్ క్రిస్టియానిటీని సాకుగా చూపుతూ హిందుత్వ ఎజెండాను తెర‌పైకి తెచ్చి ప్ర‌జ‌ల సెంటిమెంట్‌తో అట్లాడాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌య‌త్నించాయి. ప్ర‌తిప‌క్షాల కుట్ర‌లు, కుయుక్తులు పేట్రేగిపోక ముందే జ‌గ‌న్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మై సీబీఐ విచార‌ణ కోరుతూ లేఖ రాసింది.

అయితే అధికార పార్టీ వైసీపీ ఎంత‌సేపూ టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను మాత్ర‌మే విమ‌ర్శిస్తూ వ‌చ్చింది. అంతెందుకు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నిన్న చేసిన ట్వీట్‌లో చంద్ర‌బాబుపై చెల‌రేగిపోయారే త‌ప్ప‌…మ‌రో బీజేపీని మాట మాత్రం కూడా అన‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. రాజ‌కీయంగా బీజేపీతో స‌న్నిహితంగా ఉండాల‌నే త‌లంపుతో వైసీపీ సానుకూల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నా … మ‌రోవైపు బీజేపీ మాత్రం మ‌తాన్ని ముందుకు తెస్తూ విద్వేషాల్ని సృష్టించాల‌నే ప్ర‌య‌త్నాల‌ను మాత్రం మాన‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో శ‌నివారం దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ బీజేపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం నిజంగా ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంత ధైర్యం వైసీపీకి ఎప్పుడొచ్చింద‌బ్బా అనే అనుమానం క‌లిగేలా బీజేపీపై ఆయ‌న ఫైర్ అయ్యారు. మంత్రి వెల్లంప‌ల్లి ఏమ‌న్నారో తెలుసుకుందాం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ పాగా వేసేందుకు ఇక్క‌డ మ‌త‌ప‌ర‌మైన అంశాల‌ను లేవ‌దీస్తోంద‌ని మంత్రి విమ‌ర్శించారు.  2017 అక్టోబర్‌ 19న పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో రథం దగ్ధమైనా బీజేపీ – జనసేన భాగస్వాములుగా ఉన్న అప్పటి ప్రభుత్వం పట్టించు కోలేదని గుర్తు చేశారు. అప్పటి ఘటనపై ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నిం చారు. ఇప్పుడు మాత్రం అందరూ నోరు విప్పుతున్నారని ఆయ‌న మండిప‌డ్డారు.

దేవాలయాలపై రాజకీయాలు చేయడం మానే యాలని విపక్షాలకు వెల్లంపల్లి సూచించారు. ఏదో జరుగుతోందంటూ ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు భాజపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీపై ఇటీవ‌ల కాలంలో క‌నీసం ఈ స్థాయిలోనైనా మాట్లాడిన వైసీపీ నాయ‌కులెవ‌రూ లేరు. అందుకే వెల్లంప‌ల్లి మాట‌లు విన్న త‌ర్వాత సొంత పార్టీ నేత‌కే…బీజేపీపై విమ‌ర్శ‌లు చేయడానికి ఎంత సాహ‌సం అనే ఆలోచ‌న క‌లుగుతోంద‌న్నారు. అస‌లు ఇది క‌లా?  నిజ‌మా? అనే అనుమానం సొంత పార్టీ నేత‌ల‌కే క‌లుగుతుందంటే… బీజేపీ గురించి మాట్లాడ్డానికి అధికార వైసీపీ నేత‌లు ఎంత‌గా భ‌య‌ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇదే మ‌న ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో చూస్తే … బీజేపీ నోరెత్తితో అధికార పార్టీ నుంచి వంద‌ల గ‌ళాలు నోరు మూయించ‌డానికి సిద్ధంగా ఉంటాయి. ఆంధ్రాలో కూడా నోటా పార్టీ అయిన బీజేపీ అహంకారాన్ని అణ‌చివేసే రోజు ఎప్పుడొస్తుందో? అని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

సినిమా మొత్తం న‌వ్వుతూనే ఉంటారు

సీబీఐ విచార‌ణ.. జ‌న‌సేనానికి ఊహించని షాక్