ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిళ భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అదృష్టవశాత్తు అతను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో అనిల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
అనిల్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అనిల్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో కారులో అనిల్‌కుమార్‌తో పాటు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనలో కారు బాగా దెబ్బతింది.
జగన్ బావ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలియగానే స్థానిక వైసీపీ నాయకుడు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాడు. అనిల్‌తో పాటు మిగిలిన వారి యోగక్షేమాల గురించి ఉదయభాను అడిగి తెలుసుకున్నారు. ఉదయభాను తన కారులో బ్రదర్ అనిల్‌తో పాటు మిగిలిన వారిని విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అందరికీ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వాళ్లంతా యధావిధిగా తమ కార్యక్రమాలకు వెళ్లిపోయారు. కాగా జగన్ బావ ప్రమాద వార్త తెలియగానే వైసీపీ శ్రేణుల్లో కాసేపు ఆందోళన నెలకొంది. ఎలాంటి హాని జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.