ఎప్పట్లానే ఈసారి కూడా తాపీగా ఓదార్పు ఇవ్వడానికి వస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. దానికి బాబు మీడియా ఓ రేంజ్ లో ప్రచారం ఇస్తోంది. పవన్ వస్తున్నాడు పరిస్థితులు మారిపోతాయి అన్నట్టు బిల్డప్ ఇస్తోంది. ఇంతకీ పవన్ వస్తోంది ఎక్కడికో తెలుసా..? అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న వాళ్లను పరామర్శించడానికి.
రాజధానిని తరలించొద్దంటూ అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న వాళ్లను ఈరోజు పవన్ పరామర్శిస్తారు. సంబంధిత గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఇదేదో కొత్తగా చేస్తున్న ఆందోళన కాదు. దాదాపు 2 నెలలుగా జరుగుతోంది. పవన్ కు ఇప్పుడు తీరిక దొరికిందన్నమాట.
నిజానికి పవన్ రాకతో అమరావతిలో పరిస్థితులు ఏమీ మారవు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయడానికి పవన్ కల్యాణ్ కు ఇదొక సాకు, వేదిక మాత్రమే. ఇవన్నీ పక్కనపెడితే.. ఇప్పుడు పర్యటించకపోతే, ఇక అమరావతి ప్రాంతంలో పర్యటించడానికి పవన్ కు సమయం దొరక్కపోవచ్చు. అందుకే ఈ పర్యటనలు, ఆర్భాటాలు.
కేవలం రాజకీయాలే కాదు, సినిమాలు కూడా చేస్తున్నారు పవన్. ఒకేసారి 3 సినిమాలు ప్రకటించారు. వాటిలో 2 సెట్స్ పైకి వచ్చాయి. వీటిలో ఒక సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోంది. దీనికి సోమవారం నుంచి కాల్షీట్లు ఇచ్చారు పవన్. ఆ షెడ్యూల్ మొదలైతే అమరావతిలో పర్యటన మరింత ఆలస్యం అవుతుంది. అందుకే ఇలా వెలగపూడి, మందడం, తుళ్లూరులో ఓ రౌండ్ కొట్టాలని పవన్ ఫిక్స్ అయ్యారు.
రేపు కూడా అమరావతిలో కొన్ని గ్రామాల్లో పవన్ పర్యటిస్తారు. ఆ తర్వాత రేపల్లె, తాడేపల్లిగూడెం జనసైనికులతో సమావేశాలు ఉంటాయి. ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని సోమవారం నుంచి వకీల్ సాబ్ (పింక్ రీమేక్) సెట్స్ పైకి వెళ్తారు పవన్.
ఏదైనా ఒక అంశాన్ని ఇలా టచ్ చేసి అలా గాలికొదిలేయడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య కదా. ఇప్పుడు అమరావతి ఇష్యూను కూడా ఇలానే వదిలించుకుంటున్నారు జనసేనాని. ఈరోజు చేస్తున్న పర్యటనే ఆఖరిది. ఇక అమరావతి టాపిక్ నుంచి పూర్తిగా పక్కకు జరిగి, తన సినిమాలేవో తాను చేసుకోవాలని నిర్ణయించారు. సో.. అమరావతి ప్రజలకు పవన్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో ఏమో!