ఏపీ తెలుగు మహిళా ప్రెసిడెంట్ గా వంగలపూడి అనిత చాలా కాలం క్రితమే నియమించబడ్డారు. ఆమె ఇప్పటి దాకా మీడియా ముందే వైసీపీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఫస్ట్ టైమ్ ఆమె నేతృత్వంలో సర్కార్ మీద సమర భేరీ మోగించారు. దానికి నారీ సంకల్ప దీక్ష అని పేరు పెట్టారు.
వైసీపీ ఏలుబడిలో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా పెరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ఈ నారీ సంకల్ప దీక్ష డిజైన్ చేశారు. సరిగ్గా ఈ ఆందోళనకు ఒక రోజు ముందు విజయవాడ నడిబొడ్డున టీడీపీ సీనియర్ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు.
మహిళల మీద ఏ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళనతో తెలుగు మహిళలు నారీ భేరీని గురి పెట్టారో అదే గురి ఇపుడు నేరుగా వచ్చి టీడీపీకే గుచ్చుకుంది. మొత్తానికి టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయినట్లు అయింది.
పద్నాలుగేళ్ల మైనర్ బాలిక విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడు అయిన టీడీపీ సీనియర్ నేత వినోద్ జైన్ అఘాయిత్యం మీద ఇపుడు టీడీపీ మహిళలు మాట్లాడాలని వైసీపీ నేతలు గట్టిగా కోరుతున్నారు. . ఆ విధంగా తమ వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్న వేళ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత నారీ భేరీ మోగించారని ఆరోపిస్తున్నారు.
కింద పడినా పై చేయి అన్నట్లుగా ఆమె హోం మంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా ఒక పెద్ద కార్యక్రమం తెలుగు మహిళకు తలపెడితే అడ్డంగా తెలుగు తమ్ముడే గండి కొట్టడం అంటే నారీ భేరీకి రాంగ్ టైమ్ కాక మరేమిటి అంటూ ఒక్కసారిగా సైటైర్లు పడిపోతున్నాయి.