బీజేపీలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు చేరారో, ఎవరు చేర్చారో, వారంతా ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు.
రాజధాని అమరావతి నుంచి ఇంచు కూడా కదలదని, కేంద్రం అన్నీ చూస్తోందని, తగిన సమయం చూసుకుని జగన్ సర్కార్ పని పడుతుందని నిన్నమొన్నటి వరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడాయన ఏమయ్యారో, ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.
తాజాగా సుజనా చౌదరి పాత్రను భర్తీ చేయడానికి అలాంటి నాయకుడే ఏపీకి వచ్చారు. ఆయనే సీఎం రమేశ్‌నాయుడు. ఇంటిపేరులో సీఎం ఉండగానే, నిజంగానే తాను ముఖ్యమంత్రి అని రమేశ్ భ్రమిస్తున్నట్టున్నారు. సొంత ఊళ్లో తప్ప, పక్క ఊళ్లో కూడా తన పార్టీకి పది ఓట్లు వేయించే సత్తాలేని నాయకులంతా జగన్‌ను బెదిరించడానికి మాత్రం ముందు వరుసలో ఉన్నారు. జగన్‌ను బెదిరించే జాబితాలో తాజాగా సీఎం రమేశ్ చేరారు.
ఏకంగా ఆయన కేంద్రం చేతిలో 356 అస్త్రం ఉందని , ఆ విషయాన్ని మరిచిపోకూదని జగన్ సర్కార్‌ను హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కేంద్రం గమనిస్తోందని, ఆట మొదలైందని వ్యాఖ్యానించారు. విశాఖలో మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందని తమను పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు.
సీఎం రమేశ్, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి గతంలో చంద్రబాబు హయాంలో ఎంత కీలకంగా వ్యవహ రించారో అందరికీ తెలుసు. కామినేని పేరుకు మనిషి మాత్రమే బీజేపీ, మనసంతా టీడీపీనే అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
వీళ్లంతా కలిసి కేంద్రంలో బీజేపీ నీడలో జగన్ ప్రభుత్వాన్ని బెదిరించాలని చూడడం నవ్వు తెప్పిస్తోంది. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే 356 అస్త్రం ప్రయోగిస్తే తెలుస్తుంది కదా? ఎవరిని బెదిరించడానికి ఈ మాటలు? ఉడత ఊపులు మాని సాయం చేసే దానిపై దృష్టి సారిస్తే మంచిది.