ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబంతో కలిసి సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ ఏడాది దానికి మరింత అనుకూలం. మరీ ముఖ్యంగా శని-ఆదివారాలు వీక్-ఆఫ్ ఉన్నవాళ్లకు ఈ ఏడాది పండగే పండగ. అవును.. 2021లో చాలా లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. అటు సోమవారం లేదా ఇటు శుక్రవారం కలిసొచ్చేలా చాలా హాలిడేస్ పడ్డాయి.
ఉదాహరణకు జనవరి 1నే తీసుకుంటే.. 2, 3 తేదీలు శని-ఆదివారాలు పడ్డాయి. అలా ఏడాది ప్రారంభంలోనే లాంగ్ వీకెండ్ తో మొదలైంది 2021. వస్తున్న సంక్రాంతికి కూడా అలానే కలిసొచ్చింది.
14వ తేదీ సంక్రాంతి పడింది. 16, 17 శని-ఆదివారాలు. మధ్యలో ఒకరోజు లీవ్ తీసుకుంటే చాలు, 4 రోజులు కలిసొస్తుంది. ఈ నెలలోనే ఇలాంటిదే మరో లాంగ్ వీకెండ్ కూడా ఉంది. జనవరి 26న రిపబ్లిక్ డే పడింది. 23-24 తేదీలు శని-ఆదివారాలు వచ్చాయి.
ఇక మార్చిలో చూసుకుంటే మార్చి 11న మహాశివరాత్రి శెలవు ఉంది. 12వ తేదీ లీవ్ పెట్టుకుంటే.. 13-14 తేదీలు మళ్లీ శని-ఆదివారాలు పడ్డాయి. ఇలా చూసుకుంటే దాదాపు ప్రతి నెలలో ఓ లాంగ్ వీకెండ్ పడింది. మధ్యలో లేదా చివర్లో ఒక రోజు ఆఫీస్ కు లీవ్ పెట్టుకుంటే 4 రోజులు కలిసొచ్చేలా పండగలు, వీకెండ్స్ వచ్చాయి.
ఈ ఏడాది జూన్ నెలలో మినహాయిస్తే.. ప్రతి నెలలో ఇలా లాంగ్ వీకెండ్స్ సెట్ అయ్యాయి. మొత్తంగా 15 లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. అసలే కరోనా/లాక్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. దీంతో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఎన్నో కంపెనీలు ఇలా లాంగ్ వీకెండ్స్ తో ప్రచారం చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా మహమ్మారికి భయపడి ఈ ఏడాది ఏ దేశంలో ఉన్న ప్రజలు ఆ దేశంలోనే ఎక్కువగా పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తారనే విశ్లేషణల నేపథ్యంలో.. దేశీయంగా టూరిజం మరింత అభివృద్ధి చెందేందుకు ఈ ఏడాది అవకాశాలున్నాయంటున్నారు.
కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ లాంగ్ వీకెండ్స్ అన్నీ శని-ఆదివారాలు వీక్లీ ఆఫ్స్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే. అలాంటివాళ్లు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటే.. విమాన ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి.