ఒకవైపు వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులను మిస్ గైడెడ్ అని అభివర్ణిస్తూ ఉన్నారు. వాళ్లు ఖలిస్తాన్ ఉద్యమకారులని భక్తులు సెలవిస్తున్నారు! మోడీ విధానాలను ఎవ్వరు వ్యతిరేకించినా వారిపై ఉగ్రవాద ముద్ర వేయడం భక్తుల పని. ఈ వాట్సాప్ యూనివర్సిటీ మేధావులకు ఇప్పుడు ఆందోళన చేస్తున్నది సిఖ్ రైతులు కాబట్టి.. ఖలిస్తాన్ ఉద్యమం గుర్తుకొచ్చింది!
మరి సిక్కులంతా ఖలిస్తాన్ మద్దతుదారులైతే.. ఇందిర హత్య తర్వాత సిక్కులను రక్షించింది తామే అని సంఘీయులు మొన్నటి వరకూ ఎందుకు గొప్పగా చెప్పుకునేవారో మరి! మోడీ విధానాలను వ్యతిరేకించే వారిపై తీవ్రవాద ముద్ర వేయడం ఇలా జరిగిపోతూ ఉంది.
ఇక ఒకవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో గురుద్వారాను సందర్శించారు నరేంద్రమోడీ. వ్యవసాయ బిల్లుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతూనే మోడీ గురుద్వారాను సందర్శించడం పక్కా రాజకీయం అనే అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి.
ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో విషయాన్ని ప్రకటించేశారు. సిఖ్ గురువుల జీవితాలను యూపీలో విద్యార్థులకు పాఠాలుగా చెప్పనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. యూపీ పిల్లల చదువుల్లో సిఖ్ మత గురువుల పాఠాలను చేర్చబోతున్నట్టుగా తెలిపారు.
దీనిపై సహజంగానే రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిఖ్ రైతులు అడుగుతున్నది ఒకటైతే.. బీజేపీ వాళ్లు చెబుతున్నది మరోటి.. తాము చేసిన చట్టాల విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతూ, సిఖ్ లలో ఆపారమైన భక్తి ఉండే గురువుల సెంటిమెంట్ ను బీజేపీ వాళ్లు ప్రయోగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎక్కడో యూపీ నుంచి వ్యక్తమవుతున్న ఈ ఆపార ప్రేమకు పంజాబ్ పులకించిపోతుందేమో!