మెగాస్టార్ చిరంజీవికి 10 ఏళ్ల రాజకీయానికే అంత వైరాగ్యం ఎందుకు కలిగిందో…పవన్ కళ్యాణ్ అధ్యయనం చేయాలి. చిరంజీవికి ఏమి తక్కువైందని- రాజకీయాలకో నమస్కారం అన్నారో…పవన్ ఒక్క క్షణం ఆగి, వెనక్కు తిరిగి చూసుకోవాలి.
అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కటే సరిపోదని చిరు విషయంలో 2009 ఎన్నికల్లో రుజువైంది. చిరుకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం 2019 ఎన్నికల్లో మరింత స్పష్టంగా రుజువైంది.
ఫ్యాన్ ఫాలోయింగ్ ను మించి…మరేదో కావాలి, రాజకీయాలలో రాణించడానికి. చంద్రబాబు నాయుడిలా , మాన్యుపులేటివ్ బ్రెయిన్' ఉండాలి. అంకిత భావం, చిత్త శుద్ధి కలిగిన కార్యకర్తల బలగం ఉండాలి. జగన్‌లా ….కొండంత గుండె ధైర్యం, దమ్ము ఉండాలి. ప్రాణం పెట్టే నాయకులు, కార్యకర్తలూ ఉండాలి. 175 నియోజక వర్గాల్లోనూ తన అభ్యర్థుల ఎన్నికల ఖర్చును భరించగల సత్తా ఉండాలి.
ప్రత్యర్థులను ముఖాముఖి ఎదుర్కొనగలిగిన తెగింపు ఉండాలి. ప్రత్యర్థులపై తన దాడిని పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగిన యంత్రాంగం ఉండాలి. ఇలా…. సవాలక్ష లక్షణాలు, వసతులు, సదుపాయాలు, ధనరాసులూ , అశేష మానవ వనరులూ అందుబాటులో ఉండాలి.
అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాజకీయం చేయడానికి ఇతర వసతులు, సదుపాయాలూ వగైరా ఏమీ లేనందునే 2009లో చిరంజీవికి 18 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్‌కు 2019 లో ఒక్క సీటు మాత్రమే వచ్చింది.
అందుకే, చిరంజీవి రాజకీయాల కు రాం… రాం చెప్పేశారు. 'అన్నయ్య ఫెయిల్ అయిన చోట నా పవర్ ఏమిటో చూపిస్తా…'అంటూ పవన్ – రాజకీయాలను -తన ప్రతిష్టకు సంబంధించిన అంశంగా తీసుకోరాదు. ఆయన ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ; రాజకీయాలకు అనుగుణమైన వ్యవహార శైలి లోపించడం సహజం.
ఎందుకంటే- వారు సమాజంలో మసలుకోవడం లేదు. కృత్రిమ మైన సినిమా ప్రపంచంలో జీవిస్తున్నారు. ఈ రెండింటికీ – హస్తి మసికాంతరం అంత తేడా ఉంది. అదో అపర బ్రహ్మ లోకం. ఆ లోకంలో శిఖరాగ్ర స్థితికి చేరుకున్నవారు- చిరంజీవి , పవన్ కళ్యాణ్. ఈ స్థాయి, ఈ వైభోగం, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనితర సాధ్యం. రాజకీయాల్లో లేకపోయినప్పటికీ- సేవా కార్యక్రమాలను తన స్థాయికి తగ్గ రీతిలో చేపట్టడానికి , పవన్ కళ్యాణ్‌కు అడ్డంకులు గానీ; పరిమితులు గానీ లేవు.
రాజకీయాల్లో నెగ్గుకు రావడానికి అవసరమైన అర్ధబలం, అంగబలం – సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అవసరం లేదు. ' చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ద్వారా – చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ. రాజకీయాలకు ఎందుకు చిరంజీవి గుడ్ బై చెప్పారో- పవన్ కళ్యాణ్ – ఆయన దగ్గర కూర్చుని వినాలి. ఎందుకంటే- 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రధాన ఓట్ బ్యాంక్ అయినా…2019 లో పవన్ కళ్యాణ్ ప్రధాన ఓట్ బ్యాంక్ అయినా- కాపు కులస్తులే.
మిగిలిన కులాలవారు ఓట్ వేయనందునే- 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ప్లాప్ అయింది. మిగిలిన కులాలతో పాటు కాపులు కూడా పెద్దగా వేయక పోవడం వల్లే- 2019 లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఈ క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకోవాలి. సినీ పరిశ్రమలో….సినిమా ప్లాప్ అయినా…. హిట్ అయినా- పవన్ దరి దాపులకు రాగలిగిన మరో హీరో కనుచూపు మేరలో కనిపించడం లేదు.
'మేము నటించిన సినిమా సూపర్ హిట్ అయితే ఎంత వసూలు చేస్తుందో…పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్లాప్ అయినా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుంది' అని హీరో నాగార్జున ఒకసారి వ్యాఖ్యానించినట్టు ఓ సినిమా మిత్రుడు చెప్పారు. అదీ పవన్ కళ్యాణ్ స్థాయి. దానిపై దృష్టి పెట్టకుండా- అచ్చిరాని రాజకీయాలపై – సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకు అన్న విషయాన్ని పవన్ ఆలోచించాలి.
మొన్నటి 2019 ఎన్నికల్లో – ఓటు మూడు వేలు పలికిందని కొందరు మిత్రులు చెప్పారు. 2024 లో అది- అయిదు వేలకో, ఆరేడు వేలకో ఎగ బాకితే ఆశ్చర్యం లేదు. డబ్బు ఖర్చుపెట్టక పోతే – ఓటర్లు కరుణించరు, కాపులే అయినా. ఎందుకంటే – తమ్ముడు తమ్ముడే…. పేకాట పేకాటే.
అయితే, జన జీవనం నుంచి పవన్ పూర్తిగా వైదొలగాల్సిన పని లేదు. లోక్ సత్తా లాగా- జనసేనను ఒక 'ప్రెజర్ గ్రూప్' గా తీర్చి దిద్దవచ్చు. ఆయా సమస్యలను బట్టి, ప్రభుత్వం పై గళమెత్త వచ్చు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావచ్చు. ఆ విధంగా సమాజంలోని అన్ని వర్గాల వారి అభిమానాన్ని విశేషంగా చూరగొనవచ్చు.
కాపులు కూడా ఫ్రీ అవుతారు. తమ ఓట్ ను ఏదో ఒక పార్టీ కి- మార్కెట్ రేట్ ప్రకారం- వేసుకుంటారు. ఇవన్నీ ' ఉచిత సలహాలే' అయినప్పటికీ అటు మెగా బ్రదర్స్ కోణంలోనూ ఇటు వారిని సమర్ధించాలో లేదో తెలియక సతమతమై పోతున్న కాపుల కోణం లోనూ ఆలోచించి – అటూ, ఇటూ శుభం జరగాలనే కోరికతో -తాపత్రయ పడుతున్నాను.
భోగాది వేంకట రాయుడు.