రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమయం వచ్చినప్పుడల్లా మనసులో మాటను బయటపెడుతూనే ఉన్నారు.
అమరావతిపై జగన్ ఎప్పుడే విధంగా స్పందిస్తారోనని ఆ ప్రాంతంలోనే రాజధాని కొనసాగించాలని ఆందోళన చేస్తున్న, కోరుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమరావతిపై గతంలో జగన్ ఎప్పుడూ చేయని విధంగా కామెంట్ చేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి రాక్షసుల్లా ప్రతిపక్ష టీడీపీ అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఆ దుర్మార్గులు అడ్డుపడ్డారని టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు స్వార్థపరులు కుట్రలు పన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించడం వల్లే జాప్యం జరుగుతోందన్నారు. న్యాయ పరమైన ఇబ్బందులు తొలగిన వెంటనే డి పట్టాల స్థానంలో రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి మనందరికీ తెలుసు, వీరు (టీడీపీ నాయకులు) రాజధాని అని కూడా అంటా ఉంటారని జగన్ నోట ఆశ్చర్యకర మాట వచ్చింది.
గతంలో ఎన్నడూ చేయని విధంగా అమరావతిపై జగన్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మాటలను బట్టి అసలు అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కూడా జగన్ ఇష్టపడలేదని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందువల్లే అమరావతిని రాజధాని అని వారు అంటున్నారని అన్నారే తప్ప, తాను భావిస్తున్నట్టు ఆయన మాటల్లో కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాంటి రాజధాని అమరావతిలో అక్షరాలా 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తే …. కులాల పరంగా తేడా వస్తుందని చెప్పి ఏకంగా చంద్రబాబు మనుషులు కోర్టులో కేసులు వేశారని జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అలాగే విశాఖలో 1.84లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే.. ఇళ్ల పట్టాల కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తే భూమి ఇచ్చినవారికి.. లబ్ధిదారులకి సంబంధం లేని వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు.
రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని జగన్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.