వివేకా హ‌త్య‌పై ఆ జ‌ర్న‌లిస్టు ఏం చెబుతాడో?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి ఇవాళ కీల‌క వ్య‌క్తి భ‌ర‌త్ కుమార్ యాద‌వ్‌ను సీబీఐ విచారిస్తోంది. పులివెందుల జ‌ర్న‌లిస్టు భ‌ర‌త్ కుమార్ యాద‌వ్ గ‌త నెల 21న సీబీఐ డైరెక్ట‌ర్‌కు…

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి ఇవాళ కీల‌క వ్య‌క్తి భ‌ర‌త్ కుమార్ యాద‌వ్‌ను సీబీఐ విచారిస్తోంది. పులివెందుల జ‌ర్న‌లిస్టు భ‌ర‌త్ కుమార్ యాద‌వ్ గ‌త నెల 21న సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాయ‌డంతో పాటు మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు వివేకా అల్లుడు న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని భ‌ర‌త్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆస్తి గొడ‌వ‌లే హ‌త్య‌కు దారి తీశాయ‌నేది భ‌ర‌త్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అలాగే త‌న బంధువు సునీల్ యాద‌వ్ పాత్ర‌పై కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ నేప‌థ్యంలో భ‌ర‌త్ కుమార్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు విచారించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

నెల‌న్న‌ర త‌ర్వాత వివేకా హ‌త్య కేసుపై సీబీఐ విచార‌ణ జ‌ర‌ప‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగిస్తోంది. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో భ‌ర‌త్ కుమార్ యాద‌వ్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

వివేకా హ‌త్య కేసుకు సంబంధించి త‌న‌కు కీల‌క విష‌యాలు తెలుసున‌ని భ‌ర‌త్ కుమార్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాసిన నేప‌థ్యంలో కేసు ఏ మ‌లుపు తిరుగుతుందోన‌నే ఉత్కంఠ నెల‌కుంది.