రాయలసీమ ఆకాంక్షలను కాలికిందేసి నల్చడం, అలాగే అమరావతి పేరుతో రెచ్చగొడుతుండడంపై వెనుకబడిన సీమ ప్రాంతం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ సత్తా ఏంటో చూపాలని రాయలసీమ సమాజం, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఆలోచనాపరులు తహతహలాడుతున్నారు.
దీంతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశానికి మద్దతు ఇవ్వడంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే బలమైన ఆకాంక్షను వెల్లడించడానికి సీమ ఉద్యమకారులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా గురువారం తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించారు. రేపు ఉదయం కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీనికి మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి నేతృత్వం వహించనున్నారు.
ఇప్పటికే ఈయన తిరుపతిలో భారీ బహిరంగ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతి ఇస్తే శుక్రవారం (17వ తేదీ) తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ ర్యాలీతో పాటు తిరుపతి యూత్ హాస్టల్‌లో గురువారం అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, వెనుకబడిన రాయలసీమ-ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి, మూడు రాజధానులు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
ఇందులో రాయలసీమ నాలుగు జిల్లాల్లోని వివిధ సీమ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొననున్నారు. మొత్తానికి రాయలసీమలో మళ్లీ ఉద్యమాగ్ని రాజుకుంటోంది.