ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…కోర్టు మెట్లెక్కాల్సిందే అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో ఇటీవల టీటీడీ నూతన పాలకమండలిని ఏర్పాటు చేసిన తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జంబో పాలకమండలి ఏర్పాటు చేశారంటూ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్ వేయడం గమనార్హం.
పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వాని తులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని, హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.
ఇదే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో పిల్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి ఇలాంటి పిల్ బీజేపీ వేస్తుందని అందరూ భావించారు. అయితే బీజేపీ అగ్రశ్రేణి నేతల సిఫార్సుల మేరకు బోర్డులో ఎక్కువ మందికి చోటు కల్పించారనే అభిప్రాయాలున్నాయి.
దీంతో బీజేపీ వైపు నుంచి కేవలం విమర్శలకే పరిమితం కావడంతో టీడీపీనే రంగంలోకి దిగినట్టు చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి వర్గం కంటే టీటీడీ పాలక మండలిలోనే ఎక్కువ మంది సభ్యులున్నారని టీడీపీ వాదిస్తోంది. అయితే ఈ పిల్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకుంది.