గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనానికి మారుపేరు. ఏం చేసినా ఆయనకో ప్రత్యేకత ఉంటుంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడం విశేషం. తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి రాజీనామాకు సిద్ధపడినట్టు స్పష్టం చేశారు. దీనంతటికీ హుజూరాబాద్ ఉప ఎన్నికే కారణమవుతోంది.
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి కేసీఆర్‌పై రాజకీయ పోరాటం స్టార్ట్ చేశారు. మరోవైపు ఈటల రాజేందర్ బలమైన నాయకుడు కావడంతో పోరు ఆశామాషీగా ఉండదనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని… ప్రభుత్వ సొమ్మునంతా ఆ ఒక్క నియోజకవర్గంలోనే ప్రభుత్వం కుమ్మరిస్తోంది. దళిత బంధు పథకం కింద ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకే 2 వేల కోట్ల రూపాయలు పంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
దీంతో ఎన్నికలొస్తేనే కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తనపై నియోజక వర్గ ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని రాజాసింగ్ తెలిపారు. నియోజక ప్రజల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, గోషామహాల్ అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.
సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌కు బడుగులు, రైతులు గుర్తుకొస్తారని ఆయన ఎద్దేవా చేశారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తే ఖచ్చితంగా స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.