చీరాలలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కావాలని ఒకర్నొకరు కెలుక్కోవడం ఇక్కడ సర్వసాధారణమైంది. వాళ్లే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం. ఒకరేమో వైసీపీ ఇంచార్జ్. మరొకరు ఎమ్మెల్యే.
ఇద్దరి మధ్య విబేధాలు ఇప్పటికే తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పార్టీ ఏమౌతుందనే ఆలోచన లేకుండా ఇద్దరూ సొంత కుంపట్లు పెట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో నిన్న రాత్రి మరోసారి ఆమంచి, కరణం వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. నిన్న కరణం బలరాం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడి వర్గీయులు చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు బైక్ ర్యాలీ తీశారు.
అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్, తన నివాసంలో చిన్నపాటి సమావేశం ఏర్పాటుచేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు.
సరిగ్గా అదే టైమ్ లో కరణం వర్గీయుల బైక్ ర్యాలీ ఆమంచి ఇంటి పైనుంచి వెళ్లడం.. కరణం వర్గీయులు ఆమంచిని రెచ్చగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ర్యాలీ చేస్తున్న కరణం వర్గీయులు తన ఇంటిపై రాళ్లు వేశారని ఆమంచి ఆరోపించారు. అటు అదే తరహా ఆరోపణల్ని కరణం బలరాం వర్గీయులు కూడా చేశారు. ర్యాలీగా వెళ్తున్న తమపై రాళ్లు రువ్వారని ఆరోపించారు.
ఘర్షణ జరుగుతుందని ముందుగానే ఊహించిన పోలీసులు.. సాయంత్రం నుంచే పటిష్ట చర్యలు తీసుకోవడంతో పెద్ద గొడవ తప్పింది. అయినప్పటికీ ఆమంచి వర్గానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్రంగా గాయలయ్యాయి.
తాజా ఘటనలో నియోజకవర్గంలో ఆమంచి-కరణం మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఇంచార్జ్ హోదాలో ఒకరు, ఎమ్మెల్యే హోదాలో మరొకరు ఎవ్వరూ తగ్గడం లేదు. రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి వర్గ పోరు ఎటు దారితీస్తుందో చూడాలి.