చాలా తెలుగు సినిమాల్లో చూస్తుంటాం.. సరిగ్గా మెడలో తాళి కట్టే సమయానికే “ఆగండి” అంటూ గట్టిగా ఓ కేక వినిపిస్తుంది. పెళ్లి ఆగిపోతుంది. కొన్ని వందల సినిమాల్లో చూసిన ఈ సీన్ నిజ జీవితంలో రిపీట్ అయింది. ఈసారి స్వయంగా పెళ్లికూతురు “ఆగండి” అంటూ అరిచింది. తనే దగ్గరుండి పెళ్లి ఆపేసింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన కొందరికి వినోదం పంచితే, ఆ కుటుంబ సభ్యులకు తలవొంపులు తెచ్చిపెట్టింది.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ప్రియదర్శిని పెళ్లికి సిద్ధమైంది. నిశ్చితార్థం పూర్తిచేసి, పెళ్లి తేదీని నెల రోజుల కిందటే ఫిక్స్ చేశారు. ఏ దశలోనూ పెళ్లికి ప్రియదర్శిని అడ్డుచెప్పలేదు. పైగా కాబోయే భర్తతో ఫోన్ లో చక్కగా మాట్లాడింది కూడా.
సరిగ్గా పెళ్లి టైమ్ కు వచ్చేసరికి అందరికీ ఒక్కసారిగా షాకిచ్చింది ప్రియదర్శిని. వరుడు మెడలో తాళి కడుతున్న టైమ్ లో వారించింది. తను పెళ్లి చేసుకోనని చెప్పింది. మరో అర్థగంటలో తన బాయ్ ఫ్రెండ్ వస్తాడని, ఇదే వేదికపై తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
దీంతో పెళ్లి కొడుకు అవాక్కయ్యాడు. మెల్లమెల్లగా ఒక్కో విషయం చెప్పడం ప్రారంభించింది ప్రియదర్శిని. తను ఇదివరకే ప్రేమలో ఉన్నానని, ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని.. కేవలం పెళ్లి ఏర్పాట్ల కోసమే ఈ విషయం చెప్పలేదని.. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు తన లవర్ వచ్చి తన మెడలో తాళి కడతాడని తాపీగా చెప్పుకొచ్చింది.
దీంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లి కొడుకు తాళి వదిలేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇదేం విడ్డూరం అనుకుంటూ బంధువులంతా తలో దిక్కు వెళ్లిపోయారు. చివరికి అమ్మాయి తరఫు బంధువులు కూడా కోపంతో ఆమెను కల్యాణమండపంలోనే వదిలేసి వెళ్లిపోయారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో బాధాకరమైన విషయం ఏంటంటే.. తాళి కట్టే సమయానికి వస్తానని చెప్పిన ప్రియుడు పరారయ్యాడు. ఇటు పెద్దలు కుదిర్చిన పెళ్లి లేక, అటు ప్రియుడు రాక ప్రియదర్శిని ఏకాకైంది.