జ‌గ‌న్‌కు త‌లనొప్పిగా మారిన క‌డ‌ప‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సొంత జిల్లా క‌డ‌ప త‌ల‌నొప్పిగా మారింది. రాజ‌కీయంగా క‌డ‌ప జిల్లా వైసీపీకి కంచుకోట‌. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌డ‌ప జిల్లాలో చేసిన అభివృద్ధి, అలాగే సామాజిక వర్గాలు కూడా జ‌గ‌న్‌కు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సొంత జిల్లా క‌డ‌ప త‌ల‌నొప్పిగా మారింది. రాజ‌కీయంగా క‌డ‌ప జిల్లా వైసీపీకి కంచుకోట‌. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌డ‌ప జిల్లాలో చేసిన అభివృద్ధి, అలాగే సామాజిక వర్గాలు కూడా జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా లాభించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌లంగా ఢీకొట్ట‌డానికి క‌డ‌ప ఇస్తున్న నైతిక బ‌ల‌మే కార‌ణం. అలాంటి స్వ‌స్థ‌లంలో జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణపై మ‌రెక్క‌డా లేని విధంగా క‌డ‌ప‌లో నిర‌స‌న జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ప్ర‌క‌ట‌నపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన రాజంపేట‌ను కాద‌ని, రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని సొంత పార్టీ నుంచి కూడా నిర‌స‌న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే  రాజంపేట‌, రైల్వేకోడూరు, మ‌ద‌న‌ప‌ల్లె త‌దిత‌ర చోట్ల అధికార పార్టీ అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేసే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

తాజాగా రాజంపేట‌కు ప్రొద్దుటూరు కూడా తోడైంది. బంగారు వ్యాపారంలో రెండో ముంబ‌య్‌గా ప్ర‌సిద్ధిగాంచిన ప్రొద్దుటూరును జిల్లాగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ మేర‌కు  ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఆధ్వ‌ర్యంలో ఉద్య‌మ కార్యాచర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్రొద్దుటూరును జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో ప‌లువురు మేధావులు, న్యాయ‌వాదులు, వ్యాపార ప్ర‌ముఖులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేత‌లు, వైద్యులు అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు.  

వందేళ్ల క్రితమే ప్రొద్టుటూరు మున్పిపాలిటీగా ఏర్పడిందని వ‌క్తలు పేర్కొన్నారు. ఇప్పటికీ కనీసం కార్పొరేషన్‌గా కూడా రూపాంతరం చెందకపోవడానికి కేవలం ప్రొద్దుటూరు నేత‌ల‌ సంకుచిత రాజకీయాలే కారణమని అభిప్రాయపడ్డారు. ప్ర‌భుత్వాల కంటే స్వ‌తంత్రంగా వ్యాపార, ఆధ్యాత్మిక, సాంస్కృతిక‌ కేంద్రం గా ప్రొద్దుటూరు ఎదిగిందన్నారు. ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేసిందన్నారు.  

తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేసేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి కనీసం నోరు మెదపడానికి కూడా సాహసం చేయడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టిన నేప‌థ్యంలో స్థానికంగా అన్ని పార్టీల నేతలు ప్రొద్దుటూరును జిల్లాగా సాధించుకోవడానికి ఐక్యంగా ముందుకు రావాలని  కోరారు. 

ప్రొద్దుటూరు జిల్లా సాధనకు కలెక్టర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేయాల‌ని నిర్ణ‌యించారు. అలాగే ద‌శ‌ల వారీగా ఆందోళనలు, భారీ ప్రదర్శనలు, బహిరంగసభలు, బంద్‌ కార్యక్రమాలు చేపట్టాల‌ని స‌మావేశంలో తీర్మానించారు. దీంతో సొంత జిల్లాలో జిల్లాల ఏర్పాటు సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.