బాక్సాఫీస్ రికార్డులతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా రికార్డులు కూడా కొలమానంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఎన్ని లైక్స్ వస్తే, అంత సక్సెస్ అనే భ్రమలోకి చాలామంది పడిపోయారు. ఇదంతా 'పెయిడ్' అనే విషయం చాలామందికి తెలిసినప్పటికీ నంబర్ గేమ్ మాత్రం ఆగడం లేదు. కంపారిజన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సర్కారువారి పాట సినిమా నుంచి కళావతి అనే సాంగ్ రిలీజైంది. దీంతో యూట్యూబ్ నంబర్ గేమ్ మళ్లీ మొదలైంది.
విడుదలైన 24 గంటల్లో అత్యథిక లైక్స్ పొందిన వీడియోగా కళావతి సాంగ్ నిలుస్తుందా నిలవదా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి యూట్యూబ్ లో అత్యథిక లైక్స్ (24 గంటల్లో) పొందిన తెలుగు సినిమా వీడియో భీమ్లానాయక్ టైటిల్ సాంగ్. దీనికి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
భీమ్లా లిరికల్ వీడియో తర్వాత స్థానంలో కళావతి సాంగ్ నిలిచింది. నిన్న సాయంత్రం రిలీజైన ఈ లిరికల్ వీడియోకు ప్రస్తుతానికి 6 లక్షల 80వేలకు పైగా లైక్స్ ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి ఇది లైక్స్ విషయంలో భీమ్లా లిరికల్ వీడియోను క్రాస్ చేస్తుందా చేయదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.
కళావతి సాంగ్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో పుష్ప ఐటెంసాంగ్, ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ (తెలుగు వెర్షన్ మాత్రమే) రికార్డుల్ని క్రాస్ చేసింది. ఈ లిరికల్ వీడియో ఆల్రెడీ లీక్ అయింది. సోషల్ మీడియాలో చాలామంది చూసేశారు. అయినప్పటికీ వ్యూస్, లైక్స్ విషయంలో దూసుకుపోతోంది మహేష్ బాబు సాంగ్.
తమన్ ఈ సాంగ్ కు సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. గీతామాధురి, రమ్య బెహర, మోహన భోగరాజు లాంటి పెద్ద సింగర్స్ ఈ సాంగ్ కు ఫిమేల్ కోరస్ అందించారు. లిరికల్ వీడియోలో మహేష్ బాబు డాన్స్ మూమెంట్ ను కూడా జోడించడంతో వ్యూస్, లైక్స్ భారీగా వస్తున్నట్టున్నాయి.