తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత కక్ష పెంచుకున్నట్టే కనిపిస్తోంది. తమ నాయకుడికి సంఘీభావంగా నిలిచిన కేసీఆర్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, అలాగే ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మూడురోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ “మీ తండ్రి ఎవరని మేము అడగలేదు కదా” అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. అస్సాం ముఖ్యమంత్రి నోటిదురుసుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చరిత్ర కలిగిన కుటుంబం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని నెహ్రూ కుటుంబ సభ్యుడు, ఎంపీ అయిన రాహుల్‌గాంధీపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బీజేపీ సంస్కృతా అని నిలదీశారు. ఇదేనా బీజేపీ ప్రబోధిస్తున్న ధర్మమని కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ సానుకూలంగా స్పందించకపోయినా, కనీసం విమర్శలకు దిగుతుందని ఎవరూ భావించి ఉండరు.
తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఊసరవెల్లి ఫొటోను ట్విటర్లో పోస్టు చేసి, దీని ప్రత్యేకం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ… కేసీఆర్ రోల్ మోడల్ అని రీట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్నిబట్టి కేసీఆర్ అంటే రేవంత్ ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చిపడేస్తామని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలం గురించి తెలిసిన వారెవరైనా ఆ పార్టీ భవిష్యత్‌లో అధికారంలోకి వస్తుందని నమ్మరు గాక నమ్మరు.