ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనను బాగా అధ్యయనం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే, అది జనసేన అని చెప్పాలి. గతంలో టీడీపీ హయాంలో జనసేన పూర్తిగా మూడున్నరేళ్ల పాటు స్తబ్ధంగా ఉండిపోయింది. టీడీపీకి నాడు మిత్రపక్ష పార్టీగా చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలనై జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నాయకులెవరూ నోరెత్తలేకపోయారు.
కానీ జగన్ పాలనపై విమర్శించడానికి జనసేనకు ఏవీ అడ్డురాలేదు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇందుకు మత్స్యకారులకు ఇచ్చిన హామీనే నిదర్శనమన్నారు.
మత్స్యకారుల భరోసా కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాల్సిందని మనోహర్ గుర్తు చేశారు. 2 లక్షల మందికి పైగా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాల్సి వుండగా, కేవలం లక్ష మందికి మాత్రమే సాయం అందించారని ఆయన విమర్శించారు. అలాగే ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలకు బీమా ఇస్తామని నాడు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
డీజిల్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏ ఒక్క మత్స్యకారుడికి సరిపోవడం లేదన్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు జనసేన అభ్యున్నతి యాత్ర చేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో జగన్ పర్యటిస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయని హితవు చెప్పారు.