కొడాలి నాని చంద్రబాబుని తిడుతుంటే వినాలనిపిస్తుంది, మొదటిసారి భలేగా ఉందనిపిస్తుంది, రెండోసారి పర్లేదనిపిస్తుంది. పదే పదే అదే పనిగా విమర్శిస్తుంటే ఎవరికైనా ఏంటిది అనిపించక మానదు. అదే పనిగా.. మాటి మాటికీ నీ — మొగుడు అంటుంటే.. కాస్తయినా మాటలు అదుపులో ఉండాలి కదా అనిపించక మానదు.
అంబటి వ్యంగ్యాస్త్రాలు సభలో ఒక్కోసారి చెణుకుల్లా పేలుతుంటాయి, ప్రసంగం మొత్తం అసలు పాయింటే లేకుండా ఇలా అస్త్రాలు సంధిస్తూనే ఉంటానంటే కుదరదు. ఎవరికైనా మొహం మొత్తుతుంది. కళ్లింత పెద్ద పెద్దవి చేసుకుని చూస్తే భయపడిపోతానా బాబూ అని జగన్ తొలిసారి అన్నప్పుడు పత్రికల్లో అదే హైలెట్, సోషల్ మీడియాలో ఆ వీడియోనే దుమ్మురేపింది. కానీ రెండోసారి అదే సీన్ సభలో రిపీటైతే అందరూ లైట్ తీసుకున్నారు.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నా, పప్పు అని అన్నా.. ఒకటి రెండుసార్లు బాగుంటాయి, ఫన్నీగా అనిపిస్తాయి, పదే పదే పేరు చెప్పకుండా అవే పేర్లతో పిలుస్తుంటే మొనాటనీ వచ్చేస్తుంది, అసలిది అసెంబ్లీయేనా అనిపిస్తుంది. అవతలి వ్యక్తికి 23 సీట్లే రావొచ్చు, మన బలం 151 ఉండొచ్చు, అంతమాత్రాన మొన్నే కదా దారుణంగా ఓడిపోయావు, ఏం మాట్లాడతావు కూర్చోవయ్యా అంటే అందులో ప్రజాస్వామ్యం ఎక్కడుంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు దాదాపుగా ఇలా తిట్ల దండకాలకి, జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడానికే సరిపోయాయి. టీడీపీ తమలపాకుతో ఒకటి అంటే.. వైసీపీ నేతలు ఏకంగా తలుపు చెక్కతో రెండిచ్చుకుంటున్నారు. సభలో వైసీపీదే పైచేయి నో డౌట్.. నోరున్నోళ్లు, నోరు చేసుకునేవాళ్లు అందరూ ఇటే ఉన్నారు. అయితే అర్థవంతమైన చర్చలు ఆగిపోయాయనేది మాత్రం అసెంబ్లీ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విషయం.
జగన్ ని పొగడటమా లేక చంద్రబాబుని తిట్టడమా.. ఈ రెండిటికే సమయం సరిపోతోంది. స్థానిక సమస్యలను లేవనెత్తి, వాటిని మంత్రుల దృష్టికి తీసుకుపోయే ఎమ్మెల్యేలు ఎక్కడ? స్థానిక సమస్యల పట్ల రాష్ట్ర దృష్టిని ఆకర్షించి, వాటికి సత్వర ఉపశమనం దక్కేలా చేయాలనుకునే సభ్యులు ఎక్కడున్నారు? అందరిదీ ఒకటే దారి. కాసేపు స్తోత్రాలు వళ్లించడం, లేదంటే తిట్ల అందుకోవడం. ఇకనైనా ఇలాంటి వాటిని కాస్త తగ్గించి ప్రజా సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుంది.
శాసన సభ్యులు, మరీ ముఖ్యంగా అధికార పార్టీ వారు ఈ విషయం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ప్రతిపక్షం కూడా మరీ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కంటే, నిర్మాణాత్మక సలహాలిస్తే మంచిది. శాసన సభలో ప్రసంగాలను మరీ ప్రెస్ మీట్ల స్థాయికి దిగజార్చేశారు. ఇకనైనా వీటిని ఆపాలి. అప్పుడే ప్రజలకు అంతోఇంతో మేలు.