మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను అమలు చేయడానికి ఇంటర్నెట్ ఆఫ్ చేయకతప్పని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని రకాలు ఉద్రిక్తతలకు కారణమైన మోడీ మార్కు చట్టాలకు తోడు ఇప్పుడు పౌరసత్వ సవరణల చట్టం కూడా తీవ్ర దుమారం రేపుతూ ఉంది.
ఈ చట్టం చారిత్రాత్మకం అని మోడీ ప్రకటించారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ చట్టం రేపిన చిచ్చు ఆరడం లేదు. అక్కడి వివిధ తెగల ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కారు. ఆందోళనలు ఉద్రిక్త స్థాయికి చేరాయి. ఆందోళన కారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ నిరసన తెలుపుతూ ఉన్నారు.
అస్పాంలో పరిస్థితి ఇప్పటి వరకూ నియంత్రణలోకి రాలేదని తెలుస్తోంది. అక్కడ ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. వదంతులను ఆపడానికి ఇంటర్నెట్ ను ఆపేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది వరకూ ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు విషయంలో జమ్మూ అండ్ కశ్మీర్ లో ఇలానే ఇంటర్నెట్ ను ఆపేశారు. ఇప్పుడు అస్సాం వంతు వచ్చింది.
అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనిపై నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించవద్దని ఆందోళన కారులను హెచ్చరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే అల్లర్లు ఆగకపోతే బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ భారతీయ జనతా పార్టీ బెంగాళీ నేతలు ప్రకటిస్తూ ఉన్నారు.