దక్షిణ భారత బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకు సొంత పార్టీ నేతల మద్దతు కొరవడింది. కానీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం అండగా నిలిచాడు. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి వివిధ సందర్భాల్లో ఏపీ బీజేపీ నేతలకు, జీవీఎల్ నరసింహారావు మాటలకు మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. అమరావతి నుంచి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో తరలిపోదని ఏపీ బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సుజనాచౌదరి, పురంధేశ్వరి తదితరులు చెబుతూ ఉంటే, అందుకు విరుద్ధంగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని వ్యవహారమని, కేంద్రం జోక్యం చేసుకోదని కుండ బద్దలు కొట్టినట్టు జీవీఎల్ చెబుతూ వస్తున్నారు.
దీంతో ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేకుండా పోయింది. అందులోనూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కూడా జీవీఎల్ మాటలను బలపరిచేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎల్‌పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిలా జీవీఎల్ మాట్లాడుతున్నారని ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అలాగే సీఎం జగన్‌ను జీవీఎల్ ఒంటరిగా ఎందుకు కలిశారని ప్రశ్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్‌ను అక్కడి సీఎం కట్టడి చేయాలని టీడీపీ డిమాండ్ చేయడం గమనార్హం.
జీవీఎల్‌పై ఓ పథకం ప్రకారం టీడీపీ దాడి చేస్తుంటే ఏపీ బీజేపీ నేతలు మాత్రం మౌనం పాటిస్తూ….పరోక్షంగా టీడీపీకి మద్దతుగా నిలిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతుగా నిలిచాడు. రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్‌లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు.
ఈ మాత్రం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, సుజనాచౌదరి, పురంధేశ్వరి, ఇతర నాయకులెవ్వరూ జీవీఎల్‌కు మద్దతుగా నిలబడకపోవడం గమనార్హం. కేవలం సామాజిక వర్గానికి మాత్రమే సుజనాచౌదరి, పురంధేశ్వరి, కామినేని , ఇతర నాయకులు నిలిచారే తప్ప, సొంత పార్టీ జాతీయ నేతపై టీడీపీ అవాకులు చెవాకులు పేలుతుంటే ఎందుకు ఖండించలేకపోతున్నారని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులపై మాట్లాడే ఏపీ బీజేపీ నోళ్లు…జీవీఎల్‌పై టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎందుకు తెరవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది.