ఏపీ బీజేపీని జనసేనాని పవన్‌కల్యాణ్ డమ్మీ చేశాడు. అంతేకాదు, ఢిల్లీలో బీజేపీ అధిష్టానం వద్ద ఏపీ బీజేపీ నేతల స్థాయి ఏంటో పవన్ చెప్పకనే చెప్పాడు. ‘‘రాజధానిని అంగుళం కూడా కదిలించం. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని తీర్మానం చేశాను. కేంద్రానికి పంపుతాం. పోరాటాలు చేస్తాం’’ అని గొప్పలు చెప్పుకునే ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దలు ఇచ్చే ప్రాధాన్యం ఏంటో పవన్‌పై భేటీనే తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో జెండాలు వేరైనా, ఒకే అజెండాతో కలసి పనిచేయాలని జనసేన- బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఇది ఢిల్లీ వేదికగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్ మధ్య ఒప్పందం కుదిరింది. పవన్‌తో పాటు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, నడ్డాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉన్నారు.
ఏపీతో సంబంధం ఉన్న ఏ ఒక్క నాయకుడు చర్చల్లో పాల్గొనలేదు. కానీ జరిగిన చర్చంతా ఏపీ గురించే. రానున్న రోజుల్లో కలిసి పనిచేయాల్సిన నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలతో సంబంధం లేకుండా చర్చలు జరపడం ఏంటి? ‘‘అంటే మేము ఢిల్లీలో నిర్ణయిస్తాం. అమలు చేయడం వరకే మీ పని’’ అని ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పకనే చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇకపై రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఆ రెండు పార్టీలు ఢిల్లీలో తీర్మానించాయి. ఇరువర్గాలు కలిసి పనిచేసే అంశంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. ఏపీలో జనసేన లాంటి ప్రాంతీయ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయాన్ని తీసుకోడానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సోము వీర్రాజు, సుజనాచౌదరి, సీఎం రమేష్ తదితర నాయకులను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
వీరిపై ఢిల్లీ పెద్దల అభిప్రాయం ఏంటో తెలిసే పవన్ కల్యాణ్ ఏపీ బీజేపీ నేతలను కనీసం కలవడం లేదా అంటే…అవుననే సమాధానం వస్తోంది. తనకు నేరుగా ఢిల్లీ పెద్దలతో సంబంధాలున్నప్పుడు ప్రజాబలం లేని వీరితో మాట్లాడాల్సిన అవసరం ఏంటనే అభిప్రాయంలో పవన్ ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా ఏపీ బీజేపీ నేతల స్థాయిని పవన్ తన పర్యటన ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చాటి చెప్పారు.