ఆంధ్రజ్యోతి ‘ఆర్‌కే మార్క్’ అంటే ఏంటో తెలుగు రాష్ట్రాల సీఎంల కలయికపై చిమ్మిన విషాక్షరాలను చదివితే అర్థమవుతుంది. పాము కోరల్లో విషం ఉంటుందని తెలుసు. కానీ ఆర్‌కే కలంలో సిరాకు బదులు విషం ఉందని ప్రతి అక్షరం చాటుతోంది. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ఏకాంత చర్చలు జరిపారంటూనే, మరోవైపు ఏవేవో కట్టు కథలు రాశారు. ఇదే ఈనాడు విషయానికి వస్తే రెండు రాష్ట్రాల సీఎం కార్యాలయాలు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా కృష్ణా, గోదావరి జలాల అనుసంధానం, 9,10 షెడ్యూళ్లకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా వాటి గురించి చర్చించుకున్నట్టు ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి రాతలకు వద్దాం. ‘జగన్…గో ఎహెడ్’ శీర్షికతో ఫస్ట్ పేజీలో ప్రధాన వార్తకు అనుబంధ వార్తగా ఇచ్చారు.
‘‘మూడు రాజధానుల ఏర్పాటు మంచి నిర్ణయం. ఈ విషయంలో ముందుకు సాగండి అని జగన్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏకాంత చర్చలో ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతించారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో సత్ఫలితాలు వస్తాయని ఆయనకు చెప్పారు’’ అని రాశారు. ఇందులో మంచీచెడుల గురించి పక్కన పెడితే….ఏకాంతంగా ఇద్దరు సీఎంలు మాట్లాడిన విషయాల గురించి ఎలా తెలుస్తుంది. ఇందులో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటి?
అంతేకాదు ఆంధ్రజ్యోతి చూడండి…ఇంకా ఎన్ని కట్టు కథలు రాసిందో. ఈ చర్చల్లో దేశ, ఇరు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
‘‘జాతీయ స్థాయిలో బీజేపీ బలం క్రమక్రమంగా తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుండటాన్ని వారు గుర్తు చేసుకున్నట్లు సమాచారం. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయని, వీటిని బీజేపీ అసలు ఊహించలేదని అనుకున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగు ణంగా ఈ చట్టాన్ని బిల్లు సమయంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించడాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో బీజేపీ ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు’’
వైసీపీపై బీజేపీని ఉసిగొల్పాలనే రెచ్చగొట్టే రాతలు రాయడంలో ఆర్‌కే మార్క్ రాతలకు నిలువెత్తు నిదర్శనం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పి టీడీపీని బీజేపీకి దూరం చేసి సీఎం పదవి పోగొట్టడంలో ఆర్‌కే ప్రధాన పాత్ర పోషించారని ఆ పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్పిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బీజేపీతో వైసీపీకి స్నేహం చెడితే తప్ప ఏమీ చేయలేమనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ-ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలతో సంతృప్తి చెందుతోంది.
‘‘తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందుతున్న సాయం, నిధుల విడుదలలో చేస్తున్న తాత్సారం, రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. రాజధాని మార్చాలన్న జగన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేలా కేంద్రం పావులు కదపడం కూడా ప్రస్తావనకు వచ్చింది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్ ఢిల్లీలో జేపీ నడ్డాతో బేటీ కావడం, ,ఇకపై కలసికట్టుగా పని చేయాలని నిర్ణయించడంపైనా చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ ఎస్, వైసీపీ బలీయమైన శక్తులుగా ఎదగడం చూడలేక బీజేపీ ఆక్రోశిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా , ప్రాంతీయ పార్టీల అధ్యక్షులుగా , ముఖ్యమంత్రులుగా తామిద్దరూ కలసి ఐక్యంగా అడుగులు వేయాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు’’
తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీ బలీయమైన శక్తులుగా ఎదగడం చూడలేక బీజేపీ ఆక్రోశిస్తోందని సీఎంలిద్దరూ అభిప్రాయపడ్డారట. హ్హహ్హ…బీజేపీ పేరుతో ఆర్‌కే ఎంతగా ఆక్రోశిస్తున్నారో ఈ ఒక్క వాక్యమే చెబుతోంది. రాజధాని మార్చాలన్న జగన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేలా కేంద్రం పావులు కదపడం కూడా ప్రస్తావనకు వచ్చిందట. అందుకే ఐక్యంగా అడుగులు వేయాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారట. చూడు చూడు మోడీ-అమిత్‌షా…మీపై యుద్ధానికి కేసీఆర్, జగన్ ఎలా ప్లాన్ చేస్తున్నారో అని బీజేపీ నేతలను ఆర్‌కే ఎగదోస్తున్నాడు. ఆర్‌కే చెబితే తప్ప ఎవరేం చేస్తున్నారో తెలియని అమాయకంగా మోడీ- అమిత్‌షా ఉన్నారా? పాపం ఆర్‌కే. పగవారికీ కూడా ఆర్‌కే బాధ వద్దనిపిస్తోంది.