ఎల్వోసీ వద్ద ఎదురుకాల్పుల్లో మరణించిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చెందిన హవాల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఈ ఎన్ కౌంటర్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు సైనికులు మరణించారు. వారిలో తెలంగాణకు చెందిన సైనికుడు ఒకరు కాగా, ఏపీకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి మరొకరు. చొరబాటుకు పాల్పడుతున్న ఉగ్రవాదులను హతమార్చే క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపినట్టుగా సైన్యం ప్రకటించింది. వీరమరణం పొందిన సైనికుల పార్థివ దేహాలను స్వగ్రామాలకు తరలిస్తూ ఉంది సైన్యం.
ఈ నేపథ్యంలో.. ప్రవీణ్ కుమార్ రెడ్డి త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీర్తించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరమరణం పొందిన సైనికుడి నివాళి ఘటిస్తూ, వారి కుటుంబానికి లేఖ రాశారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడి మరణంతో, ఆ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షల రూపాయలను కూడా కేటాయించారు ముఖ్యమంత్రి జగన్. ఈ మేరకు ప్రవీణ్ కుటుంబానికి ఏపీ సీఎం భావోద్వేగభరితమైన లేఖను రాశారు.
అలాగే ప్రవీణ్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తదితరులు ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. 18 యేళ్ల పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి సైన్యంలో సేవలందించారు. సరిహద్దుల్లో వీర మరణం పొందారు.