నిన్న 61 కేసులు.. మొన్న 62 కేసులు.. అంతకంటే ముందు 80 కేసులు.. ఇలా ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 81 కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో ఇలా పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 6768 శాంపిల్స్ పై పరీక్షలు జరపగా.. అందులో 81 మందికి పాజిటివ్ తేలింది. 81లో ఎక్కువ కేసులు కృష్ణాలో బయటపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.. ఆ జిల్లాలో కొత్తగా 52 పాజిటివ్ కేసులు బయటపడగా.. వెస్ట్ గోదావరిలో 12, అనంతపురంలో 2, ఈస్ట్ గోదావరిలో 2, గుంటూరులో 3, కడపలో 3, కర్నూలులో 4, ప్రకాశంలో 3 కేసులు కొత్తగా బయటపడ్డాయి.
తాజా ఫలితాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1097కు చేరింది. సంఖ్యా పరంగా పొరుగునే ఉన్న తెలంగాణను ఇప్పటికే దాటేసిన ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్న మొదటి 6 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో కర్నూలు నుంచి 24 మంది, నెల్లూరు నుంచి 15, ప్రకాశం నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు, చిత్తూరు నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరి, అనంతపురం నుంచి చెరొకరు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా 231 మంది డిశ్చార్జ్ అయినట్టయింది.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 31 మంది మృతిచెందగా.. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదు. మరోవైపు విశాఖలో ఉన్న 3 యాక్టివ్ కేసులు త్వరగా కోలుకుంటున్నాయని, వాళ్లను మరో 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అధికారులు అంటున్నారు.