ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 1600 దాటింది. నిన్నటి ఫలితాలతో కలుపుకొని ఈ సంఖ్యకు చేరుకుంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈసారి కూడా అత్యథిక కేసులు కర్నూలులోనే నమోదయ్యాయి.
కర్నూలులో గడిచిన 24 గంటల్లో మరో 25 కరోనా కేసులు వచ్చాయి. అటు కృష్ణాలో 12, గుంటూరులో 19 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటితో పాటు చిత్తూరులో 1, కడపలో 4, విశాఖపట్నంలో 6 పాజిటివ్స్ లెక్కతేలాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కు చేరుకుంది.
ఈసారి ఫలితాల్లో విశాఖ నుంచి కొత్తగా మరో 6 కేసులు బయటపడడం ఆందోళన కలిగించే అంశం కాగా.. గడిచిన 48 గంటలుగా రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం. దీనికి తోడు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగి 524కు చేరింది.
మరోవైపు నిన్న ఒక్క రోజే గరిష్టంగా 10,292 శాంపిల్స్ ను పరీక్షించడం విశేషం. రాష్ట్రంలో ఒక రోజులో నిర్వహించిన పరీక్షల్లో ఇదే అత్యథికం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా పాతిక వేలకు పైగా శాంపిల్స్ ను పరీక్షించారు. గుంటూరు, కృష్ణా, కర్నూలులోని కంటైన్మెంట్ జోన్లలో దాదాపు ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ నిబంధనలు మరింత సడలించిన నేపథ్యంలో.. బయట వ్యక్తులెవ్వరూ రెడ్ జోన్లలోకి ప్రవేశించకుండా అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అలాగే కంటైన్మెంట్ ఏరియాస్ లో ఉన్న వ్యక్తులెవ్వరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1093 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.