ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై సుప్రీం కోర్టులో వాదనలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తమ క్లైంట్ ను ఏపీ ప్రభుత్వం బోగస్ కేసులతో ఇబ్బంది పెడుతోందని రఘురామకృష్ణంరాజు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో రఘురామ తరఫు న్యాయవాదుల వాదన చాలా డొల్లగా ఉండటం గమనార్హం.
ఇది వరకూ తమ క్లైంట్ కు రమేష్ ఆసుపత్రిలోనే వైద్యం అందించాలి, రమేష్ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించాలని వాదించారు రఘురామ న్యాయవాదులు. అయితే సుప్రీం కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. మిలటరీ ఆసుపత్రి లేదా నేవీ ఆసుపత్రిలోనే వైద్యానికి, పరీక్షలకు అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం.
ఇక ఇప్పుడు రఘురామ న్యాయవాదులు..తమ క్లైంట్ పై నమోదైనవి బోగస్ కేసులని అంటున్నారు. ఎవరి ఫిర్యాదులూ లేకుండానే ఈ కేసులు నమోదయ్యాయి అనేది వారి వాదనగా తెలుస్తోంది. అయితే ఎవరి ఫిర్యాదూ లేకపోయినంత మాత్రానా.. సీఐడీ చర్యలు తీసుకోకూడదా అనేది ప్రభుత్వ వాదనగా తెలుస్తోంది. ఆయన చేస్తున్న పనులకు ఎవరో వచ్చి ఫిర్యాదులు చేసే వరకూ చూస్తూ కూర్చోవాలా అంటూ తన అఫిడవిట్ లో ప్రభుత్వం ప్రశ్నించిందట.
మతాల మధ్యన, కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ, అది కూడా పొరపాటునో గ్రహపాటునో ఒకటీ రెండు సార్లు కాకుండా.. పదే పదే యూట్యూబ్ ను ఉపయోగించుకుంటూ వీడియోలు పెడుతూ, అంతా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విద్వేషాలను పెంచే వ్యక్తిని ఉపేక్షించే అవసరం లేదంటూ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
అలాగే తనను పోలీసులు కొట్టారంటూ కూడా రఘురామకృష్ణంరాజు తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడని, వాహనం నుంచి కాళ్లు చూపుతూ కామెడీ చేశారని కూడా ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొందట.
రఘురామకృష్ణంరాజు అంబులెన్స్ లో కాకుండా తన వ్యక్తిగత వాహనంలోనే తనను హైదరాబాద్ కు తరలించాలంటూ పట్టుబట్టారని, ఆయన డిమాండ్ ను పోలీసులు నెరవేర్చక తప్పలేదని, తీరా వాహనం ఎక్కాకా అక్కడ నుంచి కాళ్లు చూపుతూ హాస్యాస్పదంగా వ్యవహరించి, తనను కొట్టారంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారంటూ ప్రభుత్వం పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
రఘురామను విచారించాల్సిన అవసరం ఉందని, ఆయనను సీఐడీ కస్టడీకి అప్పగించాలని కూడా సుప్రీం కోర్టును ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరినట్టుగా సమాచారం. మరి.. ఈ వ్యవహారంపై సుప్రీం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటికే రఘురామ ఆరోగ్య పరీక్షల నివేదిక సుప్రీంను చేరింది. రఘురామను పోలీసులు కొట్టారా.. లేదా.. అనేది సీల్డ్ కవర్ లో సుప్రీం ను చేరింది.
ఆ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాదులు.. ఆ అంశాన్ని తమ అఫిడవిట్ లో ప్రస్తావించారు. తనను కొట్టారంటూ రఘురామ తప్పుడు సంకేతాలను ఇచ్చారని, కాళ్లను చూపుతూ హాస్యాస్పదంగా వ్యవహరించారని.. ఆయన తీరు అంతా అలా కుట్రపూరితంగా ఉందంటూ వారు అఫిడవిట్ లో పేర్కొన్నారు. సీల్డ్ కవర్ నివేదికలో రఘురామపై పోలీసుల దాడి లేదు అని తేలితే… ప్రభుత్వ వాదనకు సుప్రీంలో ఊతం లభించే అవకాశాలున్నాయి.
తనను పోలీసులు కొట్టారంటూ రఘురామకృష్ణంరాజు కోర్టు ముందు, మీడియా ముందు చెప్పినది డ్రామా అని తేలితే.. ఈ వ్యవహారంలో ఆయన మరింతగా నమ్మకాన్ని కోల్పోతారు. అప్పుడు కేవలం కరోనా మాత్రమే రఘురామను కాపాడగలదేమో. కరోనా పరిస్థితుల్లో అరెస్టులు, కస్టడీలు వద్దని సుప్రీం పేర్కొన్న నేపథ్యంలో మాత్రమే.. ఈ కేసు నుంచి తాత్కాలికంగా రఘురామకృష్ణంరాజుకు ఉపశమనం లభించే అవకాశాలు లేకపోలేదు.