దేశంలో సెకెండ్ వేవ్ కరోనా కేసుల సంఖ్య జూలై ప్రారంభానికి పూర్తిగా తగ్గవచ్చని నిపుణుల కమిటీ తన తాజా అంచనాల్లో పేర్కొంది. మే ద్వితీయార్థం నుంచి సెకెండ్ వేవ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఇది వరకే పలువురు వైరాలజిస్టులు అంచనా వేశారు. ఆ మేరకు కాస్త తగ్గుదల కనిపిస్తూ ఉంది. గత వారంలో సగటున రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, ఈ వారంలో ఆ సంఖ్య రెండున్నర లక్షల పై స్థాయిలో కొనసాగుతూ ఉంది.
ఆది, సోమ, మంగళ వారాల్లో ప్రతివారంలోనూ కేసుల సంఖ్య కాస్త తక్కువగా నమోదైనా, బుధవారం నుంచి మళ్లీ ఆ సంఖ్య కాస్త పెరుగుతూ ఉంది. దీనికి కారణం.. శని, ఆదివారాల్లో టెస్టులు చేయించుకునే వారి సంఖ్య, చేస్తున్న సంఖ్య కూడా తక్కువ కావడంతోనే.. వారం ప్రారంభపు రోజుల్లో వచ్చే ప్రకటనల్లో తక్కువ స్థాయి నంబర్ నమోదవుతోందని, ఆ తర్వాత టెస్టుల సంఖ్య పెరగడంతో కేసుల నంబర్ కూడా పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో వారానికి సగటును తీసుకోవడం ద్వారా అంచనాలకు రావొచ్చంటున్నారు. వారం సగటులను చూసినా.. ప్రస్తుతం అయితే గ్రోత్ రేటు లేదు. ఎంతో కొంత తగ్గుదల నమోదవుతూ ఉంది.
గత మూడు రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ బాగా తగ్గుతూ ఉంది. రోజుకు లక్షకు పైగా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇదే స్థాయిలో తగ్గుదల నమోదయితే.. ఆసుపత్రులపై లోడ్ తగ్గుతుంది, మందులు కూడా దొరకడం లేదనే పరిస్థితి కూడా తప్పుతుంది. ప్రస్తుత వారంలో ఇది కాస్త సానుకూలాంశమే.
ఇక ఈ నెలాఖరుకు రోజువారీ కేసుల సంఖ్య మరింతగా తగ్గవచ్చని ప్రస్తుత పరిస్థితులు స్పష్టత ఇస్తున్నాయి. అయితే కరోనా కేసుల తీవ్రత జూన్ నెలలో కూడా కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. జూన్ లో దేశం మొత్తం మీదా సగటున రోజుకు ఇరవై వేల కేసుల వరకూ నమోదు కావొచ్చని వారు అంచనా వేస్తున్నారు. రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదు అయిన దేశంలో రోజుకు ఇరవై కేసులంటే తక్కువే అని చెప్పాలి!
జూన్ నెలాఖరుకు ఆ స్థాయి కూడా తగ్గిపోతుందని, సెకెండ్ వేవ్ జూన్ ముగిసే సరికి పూర్తిగా తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక మూడో వేవ్ గురించి కూడా నిపుణుల కమిటీ అంచనా వేసింది. ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో కరోనా మూడో వేవ్ లో రావొచ్చని ఈ కమిటీ అంచనా వేసింది. మూడో వేవ్ లో కరోనాను ఎదుర్కొనడానికి ఆ మేరకు సిద్ధం కావాలని అంచనా వేసింది.
ఇది వరకూ ఇదే కమిటీ సెకెండ్ వేవ్ గురించి కూడా తన అంచనాలను పేర్కొంది. సెకెండ్ వేవ్ లో రోజువారీ కేసుల సంఖ్య గరిష్టంగా లక్షన్నర కు చేరవచ్చని అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు తప్పయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల వరకూ చేరింది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిపుణుల కమిటీల అంచనాలు వందశాతం నిజం కాకపోవచ్చు. కరోనా ఏ రూపాన్ని అయినా అందుకుని, పరిస్థితులను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు.