వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితి ఏంటి? ఏం జ‌రుగుతోంది?

దేశంలో ఒక‌వైపు క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూ ఉంది. రోజువారీ కేసుల సంఖ్య  కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా, రోజుకు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా కేసులంటే మాట‌లేమీ కాదు. తొలి వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్…

దేశంలో ఒక‌వైపు క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూ ఉంది. రోజువారీ కేసుల సంఖ్య  కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా, రోజుకు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా కేసులంటే మాట‌లేమీ కాదు. తొలి వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ లో మ‌ర‌ణాల సంఖ్య కూడా భారీగా న‌మోద‌వుతూ ఉంది.

చిన్న చిన్న గ్రామాల్లో కూడా క‌రోనా కార‌ణ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి ఈ సారి. తొలి వేవ్ లో క‌రోనా నీడ కూడా ప‌డ‌ని గ్రామాలు ఈ సారి క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో కూడా ప‌దుల సంఖ్య‌లో బాధితులుంటున్నారు. ఇలా క‌రోనా గ్రామాల్లో అల్లుకుపోయింది.

అయితే సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు ఆశావ‌హ‌మైన అంచ‌నాల‌ను వెలువ‌రిస్తున్నారు. దానికి మ‌రెంతో దూరం లేద‌ని వారు అంటున్నారు. అయితే వ్యాక్సినేష‌న్ గురించి కూడా నిపుణులు నొక్కి చెబుతున్నారు. వ్యాక్సినేష‌న్ భారీ ఎత్తున జ‌ర‌గాల్సిందే అని స్ప‌ష్టం చేస్తున్నారు.

వ్యాక్సిన్ తో మాత్ర‌మే హెర్డ్ ఇమ్యూనిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంత‌కీ ప్ర‌స్తుతం దేశంలో వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితి ఏమిటి? అంటే.. ప్ర‌స్తుతం రోజుకు 20 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఇది ఏ మూల‌కూ చాల‌ని నంబ‌ర్ అని కూడా స్ప‌ష్టం అవుతోంది.

ఈ ఏడాది డిసెంబ‌ర్ కు దేశంలో క‌నీసం రెండు వంద‌ల కోట్ల డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుంద‌ని ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకుంది. మ‌రి ఆ టార్గెట్ రీచ్ కావ‌డానికి ఇలాంటి 20 ల‌క్ష‌ల నంబ‌ర్ ఏర‌కంగానూ స‌రిపోదు. రోజుకు 20 ల‌క్ష‌ల చొప్పున వేసుకుంటూ పోతే.. రెండు వంద‌ల కోట్ల‌ డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డానికి క‌నీసం రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది!

ఆరేడు నెల‌ల్లో మూడో వేవ్ క‌రోనా ఉండ‌వ‌చ్చంటున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో అంద‌రికీ వ్యాక్సినేష‌న్ జ‌రిగేందుకు రెండేళ్ల స‌మ‌యం అంటే.. దేశం క‌రోనా మూడో వేవ్ ను, నాలుగో వేవ్ ను కూడా చూస్తుందేమో!

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రోజుకు క‌నీసం 90 ల‌క్ష‌ల మంది నుంచి కోటి మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాల‌ని, అప్పుడే ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి దేశంలో రెండు వంద‌ల కోట్ల డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ పూర్త‌వుతుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ విష‌యాన్నే కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ ప్ర‌స్తావించారు. రోజుకు 90 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాల్సిన ప‌రిస్థితుల్లో.. ఇంకా రోజుకు 20 ల‌క్ష‌ల మందికి మించి వ్యాక్సిన్ ను అందించ‌లేక‌పోతున్నారంటూ కేంద్ర ప్ర‌భుత్వ తీరును దుయ్య‌బ‌ట్టారు. దీన్ని కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌గా తీసుకునేందుకు ఏమీ లేదు. మూడో వేవ్ భ‌యాన‌కంగా ఉండ‌వ‌చ్చ‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో..  రోజు వారీగా క‌నీసం కోటి మందికి వ్యాక్సిన్ అందించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది.

సెకెండ్ వేవ్ ను అంచ‌నా వేయ‌డంలో కానీ,  ఎదుర్కొన‌డంలో కానీ వైఫ‌ల్యం స్ప‌ష్టం అవుతున్న నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం మూడో వేవ్ ను ఎదుర్కొన‌డానికి అయినా యుద్ధ ప్రాతిప‌దిక‌న  రెడీ కావాల్సి ఉంది. అందుకు మార్గం కూడా వ్యాక్సినేష‌నే అని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇప్పుడు చేయాల్సింద‌ల్లా వీలైనంత‌గా వ్యాక్సిన్ డోసేజ్ ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డ‌మే అని వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి రోజుకు కోటి మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌గ‌ల ప‌రిస్థితికి అనుగుణంగా ఎప్ప‌టికి వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని, అందుబాటులోకి తీసుకురావ‌డాన్ని పెంచగ‌లుగుతుందో కేంద్ర ప్ర‌భుత్వం!