ఏపీ సర్కారు ధైర్యం.. అందరికీ ఆదర్శం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ.. అన్నిటికీ అనుమతులిచ్చేసిన కేంద్రం.. ఒక్క స్కూళ్ల విషయంలో మాత్రం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టింది. అయితే చాలా చోట్ల ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. అంతెందుకు పొరుగున ఉన్న…

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ.. అన్నిటికీ అనుమతులిచ్చేసిన కేంద్రం.. ఒక్క స్కూళ్ల విషయంలో మాత్రం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టింది. అయితే చాలా చోట్ల ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. అంతెందుకు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడుల్లో కూడా స్కూళ్లు ఇంకా పునఃప్రారంభం కాలేదు. కానీ ఏపీ సర్కారు ధైర్యం చేసి ముందడుగు వేసింది. 

విడతల వారీగా, రోజు మార్చి రోజు స్కూళ్లు ప్రారంభించింది. ముందుగా 9, 10 తరగతులకు స్కూళ్లు మొదలయ్యాయి. త్వరలో 6,7,8… ఆ తర్వాత ప్రైమరీ సెక్షన్లు తిరిగి ప్రారంభం అవుతాయి. 

ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరిచిన మొదట్లో కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్కూళ్లను మూసేయాలని ప్రతిపక్షాలు అర్థంలేని వాదన తెరపైకి తెచ్చాయి. పచ్చపాత మీడియా కూడా స్కూల్ పిల్లల భవిష్యత్ పై విషం చిమ్మాలని చూసింది.

వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 1001 మంది టీచర్లకు, 416మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. జూనియర్ కాలేజీల్లో అయితే ఈ సంఖ్య సున్నా. అంటే ఒక్క లెక్చరర్ కానీ, స్టూడెంట్ కానీ కాలేజీలు తెరిచిన తర్వాత కరోనాబారిన పడలేదు. 

మొత్తంగా చూసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యలో కరోనా పాజిటివిటీ రేటు 0.5శాతం. అంటే వందలో ఒకరు కూడా కరోనాబారిన పడలేదు.

గడచిన 15 రోజుల్లో చూస్తే.. కేసుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏ ఒక్కరికీ కూడా కరోనా రాలేదు. 7 జిల్లాల్లో వెయ్యిలో ఒకరికి మాత్రమే కరోనా సోకింది. 

స్కూళ్లు తెరిచిన తొలినాళ్లలో ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా చేసిన తప్పుడు ప్రచారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన పడ్డారు. అయితే రోజు రోజుకీ వారిలో కూడా ధైర్యం పెరిగింది. కేసుల సంఖ్య పెరగకపోవడంతో విద్యార్థులను ధైర్యంగా స్కూళ్లకు పంపుతున్నారు పేరెంట్స్.

నవంబర్ 2న స్కూళ్లు తెరిచేనాటికి హాజరు శాతం 30గా ఉండగా.. ఇప్పుడది 45.15కి చేరింది. జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు 36.44శాతంగా నమోదైంది. పండగ తర్వాత హాజరు మరింత పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మొత్తమ్మీద స్కూళ్ల విషయంలో రాద్ధాంతం చేయాలని చూసిన ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించలేదు. తల్లిదండ్రుల్ని భయాందోళనల్లోకి నెట్టేయాలన్న పచ్చపాత మీడియా తాపత్రయం కూడా వర్కవుట్ కాలేదు. 

ఏపీ ప్రభుత్వం ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. ఏపీ మోడల్ గా.. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు త్వరలో స్కూళ్లను తెరిచే నిర్ణయం తీసుకోబోతున్నాయి. 

జగన్ వెనకడుగు అందుకేనా?