ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ గేమ్ బిగ్‌బాస్ రియాల్టీ షోను తలపిస్తోంది. 2024లో అధికారమే లక్ష్యంగా జనసేనతో కలిసి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పొలిటికల్ గేమ్‌లో భాగంగా తిరుపతి ఉప ఎన్నికను మొదటి టాస్క్‌గా బీజేపీ భావిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలంటే ప్రధాన ప్రతిపక్షాన్ని రాజకీయంగా కిల్ చేయడం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్.
క్షేత్రస్థాయిలో టీడీపీ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. యుద్ధానికి సమాయత్తం అయ్యే ముందు తమ బలంతో పాటు ప్రత్యర్థుల బలాబలాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే యుద్ధ తంత్రాన్ని రచించేందుకు వీలవుతుంది. అలా కాకుండా ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తే …. అసలుకే ఎసరు వస్తుంది. ఈ విషయాలన్నీ రానున్న రోజుల్లో అధికా రాన్ని హస్తగతం చేసుకోవాలని కలలు కంటున్న బీజేపీ -జనసేన పార్టీ నేతలకు తెలియవని అనుకోలేం.
ఈ నేపథ్యంలో టీడీపీని బీజేపీ టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వా? నేనా? అన్నట్టు టీడీపీతో బీజేపీ వ్యవహరిస్తోంది. ఇదే సందర్భంలో బీజేపీ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని టీడీపీ గుర్తించి అప్రమత్తమవుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను లక్ష్యంగా చేసుకుని పదేపదే బీజేపీ విమర్శలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది.
వివిధ కారణాలతో బీజేపీతో చెలిమి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు తహతహలాడుతున్నా ….అటు వైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో చాలా ముందుగానే తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ప్రకటించి మిగిలిన పార్టీలకు చంద్రబాబు ఓ సవాల్ విసిరారు.
తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నా చంద్రబాబు మాత్రం తిరిగి రియాక్ట్ కావడం లేదు. ఇది బాబు వ్యూహంలో భాగమనే టీడీపీ చెబుతోంది. కానీ సోము వీర్రాజుకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేందుకు తమవైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సోము వీర్రాజుపై వాటిని ప్రయోగించడం మొదలు పెట్టారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగా పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంటర్ అయింది. అబ్దుల్ సలాం కేసులో వైసీపీ, టీడీపీ మత రాజకీయాలు చేస్తున్నాయని సోము వీర్రాజు విమర్శించారు. ముస్లింలు కోరగానే డ్యూటీ చేసే పోలీసులను సీఎం జగన్ అరెస్టు చేయిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింలను కూడగట్టి ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.
అలాగే వైసీపీ, టీడీపీలకు ముస్లింల ఓట్లు కావాలే తప్ప హిందువులెవరూ ఓటర్లు కాదని సోము విరుచుకుపడ్డారు. టీడీపీ, వైసీపీలకు ముస్లిం ఓట్లు చాలా? మనమెవ్వరం మనుషులం కాదా? అని మండిపడ్డారు. రానున్న తిరుపతి ఉప ఎన్నికతో పాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహంగా భాగంగానే సోము వీర్రాజు హిందుత్వ ఎజెండాను తెర మీదకు తెచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలపై అధికార వైసీపీ మాత్రం స్పందించలేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రియాక్ట్ అయింది. ఒక్క చంద్రబాబు, లోకేశ్ మినహాయించి ముఖ్యనాయకులు సోము వీర్రాజుపై ఫైర్ అయ్యారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. మీ కుటుంబంలో ఎవరైనా వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడితే.. ఇలానే స్పందిస్తారా? అంటూ సూటిగా, గట్టిగా ప్రశ్నించారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు , మరో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సోము వీర్రాజు శకునిలా దాపురించారని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, తమ పార్టీ దయాదాక్షిణ్యాలపై ఎమ్మెల్సీగా ఎన్నికైన వీర్రాజు అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని బుచ్చయ్య చౌదరి హితవు పలకడం గమనార్హం. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ జగన్‌ను విమర్శించాలంటే వీర్రాజుకు భయమా అని ప్రశ్నించారు.
టీడీపీని ఎలిమినేట్ చేసే గేమ్‌లో భాగంగానే సోము వీర్రాజు అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీని కూడా ఒకే గాటన కట్టేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నట్టు గ్రహించవచ్చు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేయడం ఒక ఎత్తైతే, కనీసం రెండో స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే నంద్యాలలో ముస్లిం కుటుంబ ఆత్మహత్యపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక ….మరో మతం దృష్టిలో వైసీపీ, టీడీపీలను దోషిగా నిలబెట్టే ఎత్తుగడ ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో ఎటూ బీజేపీకి ఏమీ లేదు. దీంతో తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదో పోతుందనే భయం కూడా బీజేపీకి లేదు. అలాంటప్పుడు ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేసేందుకు దూకుడుగా పోవడంలో తప్పేమి లేదనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది.
వైసీపీకి మైనార్టీల ఓటు బ్యాంకు బలంగా ఉంది. హిందువుల ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ తొలగివేతే బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం. బీజేపీ విమర్శలు తమ కొంప ముంచుతాయనే భయాందోళన టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఎలిమినేషన్ ప్రక్రియలో బీజేపీ ఎత్తుగడలను టీడీపీ ఎలా తిప్పి కొడుతుందో వేచి చూడాలి.