గ్రేటర్ పోల్స్: బిహార్ గ్యాంగ్ ను దించుతున్న బీజేపీ

గ్రేటర్ హైదరాబాద్ పై బీహార్ గ్యాంగ్ కన్నేసింది. అవును. మీరు విన్నది నిజమే.. బీహార్ గ్యాంగ్ అంటే ఎక్కడ ఏ అఘాయిత్యాలు జరిగిపోతాయో అని జనం భయపడటం సహజం. అయితే ఇక్కడ కన్నేసిన బీహార్…

గ్రేటర్ హైదరాబాద్ పై బీహార్ గ్యాంగ్ కన్నేసింది. అవును. మీరు విన్నది నిజమే.. బీహార్ గ్యాంగ్ అంటే ఎక్కడ ఏ అఘాయిత్యాలు జరిగిపోతాయో అని జనం భయపడటం సహజం. అయితే ఇక్కడ కన్నేసిన బీహార్ గ్యాంగ్ ని చూసి ప్రజలు కాదు, అధికార టీఆర్ఎస్ కలవరపడుతోంది. 

బీహార్ లో ఎన్డీఏ కూటమిని విజయ పథాన నడిపించిన ఇంచార్జి భూపేందర్ యాదవ్ గ్రేటర్ ఎన్నికల వ్యూహకర్తగా మారబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రేటర్ ఎన్నికలు నడిపించేందుకు బీజేపీ సిద్ధపడినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న భూపేందర్ యాదవ్ తో పాటు.. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ కి చెందిన సీనియర్ నాయకులు కూడా హైదరాబాద్ కి రాబోతున్నారు. ఎన్నికలయ్యేంత వరకు వీరంతా హైదరాబాద్ లోనే ఉండి పార్టీ విజయానికి కృషిచేస్తారట. 

రాష్ట్ర నాయకత్వం కోరిక మేరకే కేంద్రలోని పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని.. భాగ్యనగరంపై పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.

దుబ్బాక ఫలితం బీజేపీకి బలమో, వాపో తెలియదు కానీ.. ఆ పార్టీ వ్యూహాలు చూస్తుంటే మాత్రం ఎక్కడలేని ఓవర్ కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అధికార టీఆర్ఎస్ ని ధీటుగా ఎదుర్కోడానికి కమలదళం ఈ కసరత్తులు మొదలు పెట్టింది.

జీతాల పెంపు, వరద పరిహారం పెంపు, ఆస్తిపన్ను తగ్గింపు.. అంటూ టీఆర్ఎస్ వరాలు ప్రకటిస్తూ పోతుంటే.. బీజేపీ నేతలు పూర్తిగా మైండ్ గేమ్ పై ఆధారపడ్డారు. దుబ్బాకలో సోషల్ మీడియా కూడా తమని గట్టి దెబ్బకొట్టిందని టీఆర్ఎస్ భావిస్తున్న వేళ.. అంతకు మించి గ్రేటర్ లో వ్యూహాలు పన్నేందుకు బీహార్ గ్యాంగ్ ని రంగంలోకి దింపుతోంది బీజేపీ.

ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినా కూడా.. బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీని వ్యూహాత్మకంగా బైటనుంచి పోటీ చేయించారు భూపేందర్ యాదవ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని భారీగా చీల్చారు. ఫలితంగా ఎన్డీఏకి మెజార్టీ నిలిచింది. 

ఇలాంటి వ్యూహాలే గ్రేటర్ లో కూడా ఉపయోగపడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అక్కడ ఎల్జేపీని వాడుకున్నట్టు.. ఇక్కడ తమతో స్నేహం కోసం అర్రులు చాస్తున్న టీడీపీతో పాటు జనసేనను వాడుకోవాలని చూస్తున్నారట.

మరికాసేపట్లో గ్రేటర్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ మేరకు కొద్దిసేపట్లో ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టబోతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

జగన్ వెనకడుగు అందుకేనా?