ఏళ్లు ఎవరికైనా వస్తాయి. అనుభవం కొందరికే వుంటుంది. తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు నుంచీ వున్న అనేక మంది నాయకులకు వయసు వచ్చింది కానీ అనుభవం వచ్చిన వారు తక్కువ. కానీ చంద్రబాబు అలా కాదు. ఆయన అనుభవం వేరు.
ఎత్తుగడలు వేరు. విజన్ 2020 అంటే జనం అంతా ఏమో అనుకున్నారు. కానీ విజన్ 2020 అంటే ఆ వేళకు దేశంలోని కీలక శాఖలన్నింటిలో తన మనుషులు వుండేలా చూసుకోవడం అని ఇప్పుడు ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి.
అలాంటి చంద్రబాబు 2019లో మాత్రం తప్పటడుగు వేసారు. జనసేనతో పరోక్ష బంధం పెట్టుకుని, దాన్ని దాచలేకపోయారు. తనకు జనసేనతో ఏ బంధం లేదని నమ్మించలేకపోయారు. తిరిగి అధికారం కోల్పోయాక కూడా మళ్లీ అదే తప్పు చేయడం ప్రారంభించారు.
ప్రధాని మోడీని నానా విధంగా విమర్శించి, తప్పు చేసా అని గమనించి, మళ్లీ ఆయన పంచనే చేరాలని అనుకుని, తన మనుషుల్ని భాజపాలోకి పంపకం చేయడం ప్రారంభించారు. ఆ విధంగా మళ్లీ తనకు భాజపాతో బంధం ఏర్పాటు అవబోతోందని జనాలను నమ్మించాలనుకున్నారు.
కానీ అక్కడే తేడా కొట్టింది. భాజపాలోకి వెళ్లి తెలుగుదేశం జనాలకు ఏపాటి విలువ వుందో అర్థం అయింది. పైగా భాజపా కూడా తమ పార్టీలోకి వచ్చిన తెలుగుదేశం మనుషులకు చెక్ చెప్పడం మొదలుపెట్టింది.
భాజపాలో వుంటూ తెలుగుదేశం స్వరం వినిపించే నాయకులను పక్కన పెట్టింది. సరైన వాడు సోము వీర్రాజే అన్నట్లుగా పగ్గాలు ఆయన చేతిలో పెట్టింది. మరోపక్క పోలవరం, ఇతరత్రా విషయాల్లో భాజపా వ్యవహారం మింగుడు పడడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో తనకు భాజాపాతో పరోక్ష పొత్తు వుందన్న ప్రచారం ముప్పు తెస్తుందని చంద్రబాబు అనుభవానికి అర్థం అయింది. అంతే కాదు, సోము వీర్రాజు లాంటి వాళ్లు వుండగా భాజపా తనకు దగ్గర కాదని, మోడీపై తాను చేసిన విమర్శలు అన్నీ డిజిటల్ రికార్డుల రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతూనే వున్నాయని, అవన్నీ తనకు భవిష్యత్ లో అవరోధమే అని గ్రహించారు.
ఇలాంటి నేపథ్యంలో మరో మూడేళ్ల తర్వాత సంగతి అలా వుంచి, భాజపా తో పొత్తుకు తాను తహ తహ లాడుతున్నానని, ఆ పార్టీతో పెరటిదోవ బంధాలు తనకు వున్నాయని జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వెయాలనుకున్నారు.
తిరుపతి ఉపఎన్నిక విషయంలో భాజపాకు మద్దతు ఇస్తామన్న ప్రచారం ఖండించాలనుకున్నారు. ఏతా వాతా ఏమయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వుంటే, గింటే అది తెలుగుదేశం పార్టీకే రావాలి కానీ భాజపాకు కాదనుకున్నారు.
అన్నింటికి మించి తెలంగాణలో కాంగ్రెస్ మాదిరిగా ఆంధ్రలో తెలుగుదేశం మూడో స్థానానికి పడిపోకూడదు. ఈ ఉప ఎన్నికలో అదే కనుక జరిగితే అంతకు మించిన శాపం మరోటి వుండదు.
అందుకే బాబుగారు తొందరగా అడుగు ముందుకు వేసారు. భాజపా కన్నా ముందుగా తమ పార్టీ అభ్యర్థిని తిరుపతి ఎన్నికలకు ప్రకటించేసారు.
గెలవడం, ఓడడం సంగతి తరువాత, ముందుగా ఆంధ్రలో ప్రతిపక్షం తామే తప్ప భాజపా కాదు అన్నది జనంలోకి వెళ్లాలి. తన స్థానంలోకి భాజపాను రానివ్వకుండా కట్టడి చేయాలి. అదే బాబుగారి అనుభవం నేర్పిన పాఠం. అందుకే ఈ వ్యూహం.